ఈమెను తల్లి అని పిలవొచ్చా..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈమెను తల్లి అని పిలవొచ్చా..!

December 3, 2017

తల్లిని మించిన దైవం లేదంటారు. అయితే కాలం మారిపోతోంది. ప్రలోభాలు, వ్యామోహాలు.. మరెన్నో కారణాల వల్ల  తల్లి ప్రేమ కూడా కలుషితం అవుతోంది. అక్రమ సంబంధానికి తన బిడ్డ అడ్డుగా వుందని, ఆ చిన్నారిని అడ్డు తొలగించుకోవడానికి ఓ తల్లి  అత్యంత కిరాతకానికి పాల్పడింది. ఆ బాలికను కాలే కాలే పెనంపై కూర్చోబెట్టి చిత్రహింసలు పెట్టింది. పాప ఒళ్లు, కాళ్లు తీవ్రంగా కాలిపోయాయి. తర్వాత అనాథ అని చెప్పి వదలించుకోవడానికి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లారు తల్లి, ఆమె ప్రియుడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు సంగతి బయటపడింది.హైదరాబాద్ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్రీనివాస్‌ నగర్‌లో ఈ ఘోరం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లలితకు నాలుగేళ్ల కూతురు ఉంది. ఆ జిల్లాకే చెందిన ప్రకాశ్‌కు కూడా పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది. దీంతో పారిపోయి హైదరాబాద్ వచ్చారు. భార్యభర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకున్నారు. లలిత ఓ హాస్టల్లో వంట మనిషిగా, ప్రకాశ్ మరో చోట వాచ్‌మేన్ గా చేరాడు. అయితే తమ సంబంధానికి బాలిక అడ్డుగా ఉందని, ఆమెను వదలించుకోవడానికి కాల్చి గాయాలపాలు జేశారు. పోలీసులు వారపై కేసు పెట్టి, బాధిత బాలికను యూసఫ్‌గూడ శిశువిహార్‌కు తరలించారు.