అత్తలపై అంత మంచి అభిప్రాయం ఉండదు చాలా మంది కోడళ్లకు. ఎప్పుడూ తమతో అన్ని విషయాల్లో పోటీ పడుతుందని భావిస్తుంటారు పాపం. కోడళ్లకు ఎక్కడ చనువిస్తే చంకనెక్కి కూర్చుంటారోనని చాలా మంది అత్తలు వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా ఏ ఇంటి తలుపు తట్టినా అత్తాకోడళ్ల పంచాయితీలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఇంటిని గుల్లచేస్తుంటారు వీరిద్దరూ. కానీ బీహార్ కు చెందిన ఓ అత్త మాత్రం వెరీ స్పెషల్. 45 ఏళ్ల వయసులోనూ తన కోడళ్లతో సమానంగా చదువుకుంటోంది. ఓ వైపు ఇంటిపని చేసుకుంటూనే అక్షర జ్ఞానాన్ని పొందుతోంది. అంతే కాదు కోడళ్లతో పాటు పరీక్ష రాసి అందరిని అవాక్కుచేస్తోంది.
కొన్ని దశాబ్దాల క్రితం మహిళలు అక్షరాస్యత విషయంలో చాలా వెనుకబడి ఉండేవారు. చదువుకునే వెసులుబాటు లేక, చదివించేవారు లేక చాలా మంది మహిళలు నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు. కానీ ఇప్పుడు పేరెంట్స్ తాహతుకు మించి లక్షలు పోసి మరీ పిల్లలను చదివిస్తున్నారు. అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వాలు సరికొత్త పథకాలను ప్రవేశపెడుతుండటంతో గృహిణులు చదువుకునేందుకు ముందుకువస్తున్నారు. ఈ క్రమంలో చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు బీహార్లోని నలందకు చెందిన శివర్తి దేవి అనే 45 ఏళ్ల మహిళ. ఓ వైపు అత్తగా తన ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు కోడళ్లను చదివిస్తూ తాను చదువుకుంటోంది. వారితో సమానంగా పరీక్షా హాలుకు వెళ్లి పరీక్ష కూడా రాసింది.
2009లో అప్పటి బీహార్ ప్రభుత్వం నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు అక్షర్ అంచల్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. 15 నుంచి 45 ఏళ్ల వయస్సున్న మహిళలకు కనీస విద్యను అందించాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా 6 నెలల పాటు వర్ణమాల, గుణింతాలు, అంకెలు, కూడికలు, తీసివేతలు, ప్రభుత్వ పథకాలు, ఇంగ్లీషు భాషపై శిక్షణ ఇవ్వడంతో పాటు సంతకం పెట్టడం వంటి చిన్న చిన్న విషయాలపై మహిళలకు అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసిన వారికి పరీక్ష పెట్టి సర్టిఫికేట్ ను అందిస్తారు. ఈ క్రమంలో ఆరు నెలల శిక్షణను పూర్తి చేసిన ఈ అత్తాకోడళ్లు ప్రాథమిక పరీక్ష రాసేందుకు పరీక్షా హాలుకు రావడంతో అత్త శివర్తి దేవి వార్తల్లో నిలిచారు. నాలుగు పదుల వయసులోనూ చదువుకోవాలన్న శివర్తి ఆసక్తిని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.