Mother Minati Mukherjee spoke about Arpita
mictv telugu

కూతురు నా మాట వింటే పెళ్లి చేసేదాన్ని.. కానీ సినిమాలంటూ తిరిగేది

July 30, 2022

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పశ్చిమ బెంగాల్ కోట్ల డబ్బు అర్పితకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోల్‌కతాలోని నివాసం ఉంటున్న అర్పిత ఇంట్లో ఈడీ దాడులు చేసి రూ. 50 కోట్ల పైచిలుకు నగదు, 10 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీకి సన్నిహతంగా ఉంటూ ఉపాధ్యాయ నియామకాల్లో కోట్లు వసూలు చేసి విలాసవంతమైన సౌకర్యాలు అనుభవించిన అర్పిత తల్లి మినాటి ముఖర్జీ అదే నగరంలో పాడుపడిన పూర్వీకుల ఇంట్లో నివసిస్తోంది. మీడియా ఆమెను పలకరించగా, తన భర్త ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడని, కానీ, అర్పితకు మాత్రం ఉద్యోగం మీద ఎలాంటి ఆసక్తి లేదని పేర్కొంది. సినిమాలు, టీవీల్లో నటించాలనే కోరికతో చాన్నాళ్ల క్రితమే ఇల్లు వదిలి వెళ్లిపోయిందని, తన మాట వినుంటే ఈపాటికి పెళ్లి చేసేదాన్నని వెల్లడించింది. వారం క్రితమే తన దగ్గరకు వచ్చి కొన్ని గంటల్లోనే వెళ్లిపోయిందని గుర్తు చేసుకుంది. ఎప్పుడు తనను చూడడానికి వచ్చినా ఆమె ప్రవర్తన ఇలాగే ఉండేదని వాపోయింది. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి మినాటి ముఖర్జీకి సహాయకులుగా ఇద్దరిని అర్పిత నియమించిందని స్థానికులు చెప్పారు. అర్పితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం ఆలస్యంగా తెలిసిందనీ, అయితే ఆమె ఆర్దిక లావాదేవీల గురించి సాధారణ జీవనం గడిపే తల్లి మినాటికి ఏమాత్రం తెలియదని వారు చెబుతున్నారు.