కొత్త మోటారు చట్టం.. తొలిరోజు బాదుడే బాదుడు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మోటారు చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. నిబంధనలు పాటించని వారి పట్ల పోలీసు అధికారులు కొరడా ఝులిపించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ స్థాయిలో ఛలాన్లు విధించారు. దేశరాజధాని ఢిల్లీలో చలాన్ల మోత మోగించారు. వివిధ నిబంధనల కింద 3,900 చలాన్ల జారీ చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి కొత్త చట్టం ప్రకారం చలానాలు వేశారు. వాహనదారులు వీటిని గుర్తించి నిబంధనలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు.
జులైలో పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఏపీ, తెలంగాణలో మాత్రం ఇంకా ఇది అమలులోకి రాలేదు. పాత నిబంధనల ప్రకారమే ఆదివారం చలానాలు విధించారు. తమకు ఇంకా ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో పాత పద్దతినే కొనసాగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే వాహనాదారులు మాత్రం నిబంధనలు ఉల్లంఘించ వద్దని కోరుతున్నారు. ఎక్కడిక్కడ ‘ట్రాఫిక్ రూల్స్ పాటించండి… మీ డబ్బు ఆదా చేసుకోండి’ అనే నినాదంతో ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. త్వరలోనే ఇక్కడ కూడా కొత్త చట్టం అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.