బైక్ దొంగ.. 15 రోజుల తర్వాత పార్సిల్లో పంపాడు..
లాక్‌డౌన్ కష్టాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ‘నాకు మరో మార్గం లేక మీ సైకిల్ దొంగతనం చేస్తున్నాను. క్షమించండి.. ’ అని ఇటీవల ఓ దొంగ ఉత్తరం రాసి మరీ పట్టుకెళ్లాడు. తమిళనాడులో అలాంటి ఉదంతమే మరొకటి జరిగింది. బైక్‌ను ఎత్తుకెళ్లిన దొంగ పక్షం రోజుల తర్వాత దాన్ని తిరిగి యజమానికి పార్సిల్ చేశాడు. పార్సిల్ ఆఫీసు నుంచి బండిని విడిపించుకోడానికి యజమానికి చేతిచమురు వదిలినా మొత్తానికి తిరిగి వచ్చినందుకు ఊపిరిపీల్చుకున్నాడు.
కోయంబత్తూర్‌లోని పల్లపాళయానికి చెందిన సురేశ్ అనే వ్యక్తి తన బైక్‌ను గత నెల 18న తన లేత్ వర్క్ షాపు ముందు నిలిపి ఉంచగా ఎవరో ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా ఓ వ్యక్తి దాన్ని తీసుకెళ్లడం గమనించాడు. బండి తీసుకెళ్లిన వ్యక్తిని ప్రశాంత్ గా గుర్తించి అతని ఇంటికి వెళ్లాడు. అయితే ప్రశాంత్ అప్పటికే చెక్కేశాడు. కరోనా టైంలో దర్యాప్తు సాగలేదు. పదిహేను రోజుల తర్వత సురేశ్‌కు బైక్ పార్సిల్లో వచ్చిందని గూడ్స్ క్యారియర్ సంస్థ నుంచి ఫోనొచ్చింది. పార్సిల్ ఆఫీసుకు వెళ్లిన సురేశ్ తన బైక్ కనిపించడతో సంతోషించాడు. రూ. 1800 ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు కట్టి దాన్ని విడిపించుకున్నాడు. పోయిందనుకున్న బైక్ తిరిగి రావడంతో హమ్మయ్య అనుకున్నాడు. బైక్‌ను ఎత్తుకెళ్లిన ప్రశాంత్ మన్నార్ గుడికి వెళ్లి, భయంతో తిరిగి దాన్ని సురేశ్‌కు డెలివరీ చేశాడు. తన చోరీ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్డడంతో ప్రశాంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.