ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరిగింది! ఎందుకు? ఎలా?  - MicTv.in - Telugu News
mictv telugu

 ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరిగింది! ఎందుకు? ఎలా? 

December 8, 2020

nnn

చెట్లు ఎత్తు పెరుగుతాయి. పిల్లలు ఎత్తు పెరుగుతారు. ఆవులు, ఏనుగులు కూడా ఎత్తు పెరుగుతాయి. ఎత్తు పెరిగేవి ఏవైనా సరే కొన్నేళ్ల తర్వాత వాటి పెరుగుదల ఆగిపోతుంది. ఈ సృష్టిలో అసలు ఎత్తు పెరగనివి కూడా చాలా ఉన్నాయి. కొండలు ఎత్తు పెరగవు. బండలు కూడా పెరగవు. కానీ దీనికి భిన్నంగా ఓ మహాపర్వతం ఎత్తు పెరుగుతూ పోతోంది. 

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం ఎవరెస్ట్‌ ఎత్తు పెరిగిపోయింది. దాదాపు ఒక మీటరు ఎత్తు పెరిగింది. నేపాల్‌, చైనా ప్రభుత్వాలు ఈ విషయం వెల్లడించాయి. తాజా కొలతల ప్రకారం ఎవరెస్ట్‌ ఎత్తు 8,848.86 మీటర్లు. 1954లో భారత ప్రభుత్వం కొలిచినప్పడు దీని ఎత్తు 8,848 మీటర్లు మాత్రమే. అంటే అప్పటి ఎత్తుతో పోలిస్తే కొండ మరో 86 సెంటీమీటర్ల ఎత్తు పెరిగిందన్నమాట. 

ఎవరెస్ట్ కొండ హిమాలయ పర్వాతాల్లో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పర్వతాల కింద.. అంటే భూగర్భంలో ఉన్న ఖండాంతర శిలాఫలకాలు తరచూ కదులుతుంటాయి. భారత ఉపఖండ ఫలకం, యరేసియన్ ఉపఖండ ఫలకం మధ్యలో ఎవరెస్ట్‌ ఉంది. భారత ఫలకం యురేసియన్ ఫలకంలోకి చొచ్చుకుపోతూ ఉంటుంది. వీడి ఘర్షణ వల్ల హిమాలయాల ఎత్తులో మార్పు వస్తూ ఉంటుంది. ఇది ఒక రోజులో, ఒక ఏడాదిలో జరిగే మార్పు కాదు. కొన్ని వేలు, లక్షల సంవత్సారాలుగా సాగే మార్పుల వల్ల కొండల్లో ఎత్తుపల్లాలు ఏర్పడుతుంటాయి. 

తాజాగా ఎవరెస్ట్ ఎత్తును కొలవడానికి ఒక కారణం ఉంది. 2015లో నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపం తర్వాత ఎవరెస్ట్‌ ఎత్తు తగ్గిపోయి ఉంటుందని భావించారు. దాని ఎత్తును కొలవడానికి నేపాల్.. చైనా సాయం తీసుకుంది. కొలతలు తీయగా ఎవరెస్ట్ ఎత్తు అంచనాకు భిన్నగా 86 సెంటీమీటర్లు పెరిగినట్లు తేలింది. అంటే ఎవరెస్ట్‌ను ఎక్కేవాళ్లు మరో మీటరు పైకి ఎక్కాలన్నమాట!