ప్రభుత్వ ఎలుక భోజనం.. చికిత్స కూడా ఉచితమే - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వ ఎలుక భోజనం.. చికిత్స కూడా ఉచితమే

December 3, 2019

లీటర్ పాలల్లో బకెట్ నీళ్లు కలిపి 81 మంది విద్యార్థులకు తాగించిన ఘటనపై తీవ్ర వివాదం రేగిన విషయం తెలిసిందే. ఆ ఘటన గురించి మరిచిపోక ముందే ఉత్తరప్రదేశ్‌‌లో మరో ఘటన వెలుగుచూసింది.  విద్యార్థులకు పెట్టే భోజనంలో ఎలుక రావడంతో మధ్యాహ్న భోజన పథకం మరోసారి వివాదంగా మారింది. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఈ పథకానికి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే వాటి ఫలాలు మాత్రం విద్యార్థులకు అందడం లేదని మరోసారి రుజువైంది. ఈ ఆహారం తిన్న తొమ్మిది మంది విద్యార్థులతో పాటు ఓ టీచర్‌ కూడా అస్వస్థతకు గురయ్యారు. 

Mouse

ముజఫర్‌నగర్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆరు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు మంగళవారం మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా భోజనం వడ్డించారు. అది తిన్న కాసేపటికే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో భోజనం పాత్రను పరిశీలించగా.. అందులో ఎలుక చనిపోయి ఉంది. దీంతో వెంటనే విద్యార్థులను, టీచర్‌ను స్థానిక ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ భోజనాన్ని హాపూర్‌కు చెందిన జన్‌ కల్యాణ్‌ సంస్థా కమిటీ అనే ఎన్జీవో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో యోగి ప్రభుత్వ పాలనా తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.