నేడు ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ సభలో నోరూరించే వంటకాలు రెడీ అవుతున్నాయి. సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు దేశంలోని ముగ్గురు సీఎంలతోపాటు పలువురు జాతీయ కీలక నేతలు హాజరవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5లక్షల మందితో జాతీయస్థాయిలో దేశం దృష్టంతా తెలంగాణవైపు ఉండేలా సభ నిర్వహణకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ఈ సభకు హాజరవుతున్న అతిథులకోసం ప్రత్యేక విందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయ నేతలు హాజరవుతున్న నేపథ్యంలో భారీస్థాయిలో విందులకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జాతీయ నేతలకు తెలంగాణ సాంప్రదాయ రుచులు చూపించాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్ణయించారట. అందులో భాగంగానే రకరకాల మెనూతో భారీ ఎత్తున వంటకాలు తయారు చేస్తున్నారు. ఈ వంటకాల్లో 17 రకాల నాన్ వెజ్, 21రకాల వెజ్ వంటకాలు రెడీ చేస్తున్నారు. ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం బీఆర్ఎస్ సభకు హాజరుకానున్న ముఖ్య అతిథులకు ఆత్మీయ ఆథిత్యం ఇచ్చే విధంగా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా ముగ్గురు సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్ , పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజ తదితరుల కోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్, ఖమ్మంలో భోజనం మెనూను ప్రత్యేకం ఏర్పాటు చేస్తోంది. వారికి తెలంగాణ వంటకాల టేస్టును చూపించనున్నారు.
ఇక ఈ ప్రత్యేక వంటకాల్లో మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, నాటుకోడికూర, తెలంగాణ స్పెఫల్ మటన్ కర్రీ, తలకాయ ఇగురు, బొమ్మిడాల పులుసు, బోటీ ఫ్రై, మటన్ లివర్ ఫ్రైతో రుచికరమైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఇక వెజ్ లో పనీర్ బటర్ మసాలా, మెతీ రమన్ , తడ్కా, బచ్చల కూర, మామిడికాయ పప్పు, బీరకాయ, బెండకాయ, కాజు ప్రై, పచ్చిపులుసు వంటి కూరలు సిద్దం చేస్తున్నారు. మొత్తం 500ల మందికి మెనూ సిద్ధం చేస్తున్నారు.