అటు యిటు అయిన గౌతమూ నందా! - MicTv.in - Telugu News
mictv telugu

అటు యిటు అయిన గౌతమూ నందా!

July 28, 2017

చిత్రం :  గౌతమ్ నంద

ఉప శీర్షిక : ఎ జర్నీ ఇన్ టు ద సెల్ఫ్

నిడివి :  156 నిముషాలు

బేనర్ : శ్రీ బాలాజీ సినీ మీడియా

పాటలు : రామజోగయ్య శాస్త్రి

ఫైట్స్: రామ్ లక్ష్మణ్

సినిమాటోగ్రఫి : సుందర్ రాజన్

ఎడిటింగ్ : గౌతమ్ రాజ్

సంగీతం : యస్. యస్. తమన్

నిర్మాతలు :  జె. భగవాన్, జె. పుల్లారావ్

కథ –  మాటలు – స్క్రీన్ ప్లే  – దర్శకత్వం : సంపత్ నంది

నటులు : గోపీచంద్, హన్షిక, కేథరిన్, సచిన్ ఖేడ్ ఖర్, ముఖేష్ రుషి, సీత, చంద్రమోహన్, అన్నపూర్ణ, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, బిత్తిరిసత్తి తదితరులు

ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోంది. డబ్బు ఆడించినట్టు ఆడుతోంది. డబ్బు పాడించినట్టు పాడుతోంది. డబ్బే మనుషుల్ని తయారు చేస్తోంది. మనిషిలో మంచినైనా చెడునైనా పెంచేది పోషించేది అన్నీ డబ్బే! ‘ధనం మూలం ఇదం జగత్’.. అంటే అన్నిటికీ ధనమే మూలం అని! చివరకు ఈ సినిమా లక్ష్యం కూడా అదే!

ఒక సత్యాన్ని లేదా సారాన్ని చెప్పడానికి అందుకు తగ్గ కథని ఎన్నుకోవాలి. అందుకు సినిమా కూడా అతీతం కాదు. ఒక పాత్రని అనుకున్నప్పుడు అందుకు తగ్గ నటున్ని ఎన్నుకున్నట్టు ఎన్నుకోవాలి. అలా కాకపోతే వస్తువు మంచిదే అవుతుంది కాని కట్టే కథ మాత్రం ‘కట్టు కథ’ అవుతుంది. తప్పితే ‘పుట్టు కథ’ కాదు. జీవితంలోంచి కథ పుడితేనే అనుకున్న సత్య సారాంశాలు ఇంకుతాయి! ఆకట్టుకుంటాయి! ప్రేక్షకుణ్ణి పట్టుకుంటాయి!

కథకొస్తే- ఫోబ్స్ మేగజైన్ గుర్తించిన యాభై మంది అత్యంత సంపన్నుల్లో మన భారతీయ సంతతికి అందునా తెలుగు సంతతికి చెందిన విష్ణుప్రసాద్ కొడుకే గౌతమ్(గోపీచంద్). జీవితాన్ని నింగీ నేలా నీరూ అన్నిటా తేలిపోతూ జీవితాన్ని ఉల్లాసంగా గడిపేస్తూ వుంటాడు. ‘నువ్వెవరు?’ అని వెయిటర్ వేసిన ప్రశ్నతో ‘సన్నాఫ్ కేరాఫ్ కాకుండా నేనెవర్ని?’ అని ప్రశ్నించుకుంటాడు. వెయిటర్, క్లీనర్, సర్వర్.. యిలా తనేంటి అనే ప్రశ్న డిస్ట్రబ్ చేస్తుంది. ఆకలి తెలీకుండా తిండి, దాహం తెలీకుండా నీళ్ళు.. యిలా అన్నీ సమకూరిన గౌతమ్ తనని తాను తెలుసుకోవడానికి ఫ్రస్టేషన్ తో ప్రయాణం మొదలు పెడతాడు. యాక్సిడెంట్ అయితే కనీసం నొప్పయినా తెలుస్తుందని. కాని ఆయాక్సిడెంటులో యాక్సిడెంటల్ గా నంద(గోపీచంద్) తారస పడతాడు. గౌతమ్ కు పూర్తి విరుద్దమైన కథ నందాది. డబ్బు ఎక్కువై వొకరు.. డబ్బు లేక వొకరు చావలనుకున్న వాళ్ళు ముప్పై రోజులు వొకరి స్థానంలోకి మరొకరు వెళ్లాలని అనుకుంటారు. ఆతర్వాత ఏమైంది అన్నది తెర మీద చూడాల్సిన సినిమా.

సంపత్ నంది ఆలోచన మెచ్చదగ్గదే! కాకపోతే ఆలోచనను సినిమాను చెయ్యడంలో ‘రాముడు- భీముడు’ మొదలు అనేక సినిమాల పాత పద్దతిలోకే మళ్ళారు. ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్ళడం అనేక సినిమాల్లో వచ్చింది. కథ తెలిసాక ఆకట్టుకోవడం కష్టమవుతుంది. ఎమోషన్స్ పుట్టినా చచ్చినా అది డబ్బువల్లే అని చెప్పటానికి దర్శకుడు చాలా కష్టపడ్డాడు. ముగింపు ఆకట్టుకున్నా ఏదో సినిమా నడుస్తున్నట్టు అనిపిస్తుందే తప్పితే లీనం కాలేము. వాస్తవ కథ ద్వారానే వాస్తవ సత్యాలు వెల్లడవుతాయి! నిజానికి గౌతమ్ నంద యిద్దరుగా చూపించినా ఒకే మనిషిలో యిద్దరూ వుంటారు! ఆలోతులు అందకుండా ప్రేక్షకుడిని కమర్షియల్ అనే కట్టు కథ అడ్డం పడుతుంది!

గోపీచంద్ స్టైలిష్ గా ప్రత్యేకంగా కనిపించాడు. పాత్రలో లీనమయ్యాడు. హన్షిక, కేథరిన్ హీరోయిన్లే అనిపించుకున్నారు. కెమెరా బావుంది. తమన్ సంగీతం యధావిధిగా వుంది. సంపన్నకుటుంబం అంటే అలానే తగ్గకుండా చూపించాడు దర్శకుడు.  మాటలు అక్కడక్కడా మెరిసాయి. కాని ఏదో మిస్సయినట్టు అనిపిస్తుంది. ఆ మిస్సయ్యింది సహజత్వమే! ఫక్తు కృత్రిమ కథలతో వున్న సినిమా కథలు.. జీవన సారం వల్లకాని.. నిజ జీవిత కథలకు మళ్లే సందికాలంలో వచ్చిన సినిమాగా అనిపిస్తుంది!

రేటింగ్: 2.75/5

-జాసి