‘నక్షత్రాలు’ చూపించిన కృష్ణవంశీ!   - MicTv.in - Telugu News
mictv telugu

‘నక్షత్రాలు’ చూపించిన కృష్ణవంశీ!  

August 4, 2017

చిత్రం :  నక్షత్రం

ఉప శీర్షిక : టు ప్రొటెక్ట్ & సర్వ్

నిడివి :  166 నిముషాల 34 సెకన్లు

బేనర్ : బుట్ట బొమ్మ క్రియేషన్స్, విన్ విన్ విన్ క్రియేషన్స్

సినిమాటోగ్రఫి : శ్రీకాంత్ సరోజ్

ఎడిటింగ్ : శివ వై ప్రసాద్

సంగీతం : భీమ్స్ సిసిరొలియో, భరత్ మధుసూదన్, హరి గౌరవ

నిర్మాతలు :  కె. శ్రీనివాసులు, యస్. వేణుగోపాల్, సజ్జు

రచన – దర్శకత్వం : కృష్ణవంశీ

నటులు : సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ, రేజీనా, ప్రజ్ఞా జైస్వాల్, తులసి, తనీష్, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా, జెడి చక్రవర్తి, బ్రహ్మాజీ, రఘుబాబు, వైవా హర్ష మరియు శ్రేయ తదితరులు

మనం వొక్క సారిగా నలభైఏళ్లు వెనక్కి వెళ్ళగలిగితే బాగుణ్ణు. అప్పుడు ఈ సినిమా చూడగలిగితే బాగుణ్ణు. అప్పుడు మనకి కూడా యే డ్రగ్గో యింజక్షన్ గా యిచ్చి కాళ్ళూ చేతులూ కట్టేసి మరీ ఈ సినిమా చూడమంటే యింకా బాగుణ్ణు. చాలక మనకి కూడా టైం బాంబులు కట్టేసి చంపేస్తే బాగుణ్ణు. అప్పుడు మనకళ్ళ ముందు వొక ‘నక్షత్రం’ కనిపించేది!

కృష్ణవంశీ తెలుగుదనం వుట్టి పడే దర్శకులు. గత కొన్నాళ్ళుగా ఆయన్ని ఆయనే చేరిపెసుకొనే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. ఇప్పుడూ ఆ ప్రయత్నమే చేశారు. సందీప్ కిషన్ మంచి చలాకీతనం వున్న నటుడు. తన నటనకి తగ్గ పాత్రలూ సినిమాలూ చూజ్ చేసుకోవడంలో వెనుకపడ్డాడు. ‘నగరం’లో వెలిగినా ఆ వెలుగు చాలలేదు. అలా యిద్దరికీ విజయం అనివార్యమైన స్థితిలో వచ్చిన సినిమా విజయం సాధించడం అవసరం. ఆ అవసరానికి దూరంగా వుండిపోయింది ‘నక్షత్రం’.

కథ కొస్తే – ముత్తాత పోలీసు గార్డు, తాత కానిస్టేబుల్, తండ్రి హెడ్ కానిస్టేబుల్.. వంశపారంపర్యంగా పోలీసులుగా వస్తున్న కుంటుంబంలో రామారావు(సందీప్ కిషన్) ఇనస్పెక్టర్ కావాలని కలలుకంటాడు. ఆ కలల్ని తయారు చేసింది తలిదండ్రులూ తాతముత్తతలే. పోలీసు రామాయణంలో హనుమంతుడులాంటివాడని తండ్రి మాటను నమ్ముతాడు. అయితే మూడో ఆఖరిఅవకాశంలో రిటన్ పరీక్షలో పాసైనా మిగతా పరీక్షలకు హాజరు కావల్సివున్నా కమీషనర్ కొడుకు అడ్డుకోవడంతో ఆ అవకాశం కోల్పోతాడు. ఆత్మహత్య చేసుకోబోయి కూడా రైల్లో బాంబు తీసి పోలీసు డ్యూటీ చేస్తాడు. సెలెక్ట్ అయినా అవకపోయినా నువ్వు పోలీసువే నే తల్లి, వొంటి మీద యూనిఫామ్ వున్నవాడు పోలీసు అయితే, యూనిఫామ్ లేని పౌరుడు కూడా పోలీసు అనే మావయ్య.. మెచ్చుకొని ‘అలగ్జాండర్’ యూనిఫామ్ యివ్వడంతో అప్పటిఅకప్పుడు దొంగల్ని పట్టేసుకొని, ఆగక డ్యూటీ చెయ్యడానికి బయల్దేరితే డ్రగ్ మాఫియాని అడ్డుకోవడం- ఆపైన పోలీసులకు ‘దొంగ పోలీసు’గా దొరికిపోవడం.. చివరకు తను అనుకున్నది సాధించాడా లేదా అన్నది తెర మీద చూడవలసిన కథ!

కథగా యిక్కడివరకూ బాగున్నా, మరో కథ మొదలవుతుంది. అది ‘అలగ్జాండర్’(సాయి ధరమ్ తేజ) కథ. అతను జనంలో బాంబులతో ఆహుతి అయినా పోలీసులకు తెలీదు. అతని కోసం వెతుకుతున్న ప్రేయసి, పోలీసు ఆఫీసరు.. కానీ దొంగ తనాలు చేస్తుంది, యెందుకో తెలీదు. డ్రగ్స్ ముఠా ఆగడాలు.. చేతులు కలిపిన కమిషనర్ కొడుకు.. ముందు నుండి తెలిసిన విషయమే కొత్తగా మళ్ళీ రివీల్ చెయ్యడం..

ప్రేక్షకుల అభిరుచి మారింది. ప్రేక్షకులు మారారు. దర్శకుడు మారకపోతే యెలా? వాస్తవానికి దగ్గరగా చిత్రాన్ని తీయడమే యివాల్టి కొత్తదనం. పాత మూసలో పడి జడ్జిమెంటు కోల్పోయి ఏదో చేద్దామని ఏదో చేసినట్టుందీ కథ. కనీసం నకిలీ పోలీసుగా హీరో చేస్తే- అసలు పోలీసులు యెంత నకిలీగా వున్నారో తీసినా వాస్తవానికి దగ్గరగా వుండేది. లేదూ అంటే వుద్యోగం సంపాదించాక ఆ వుద్యోగంలో వుండడం యెంత కష్టమో చూపించి- సమాజంలో అసంఘటిత శక్తులతో చేతులు కలిపిన రాజకీయవ్యవస్థ అన్ని వ్యవస్థల్ని యెలా ముడ్డికింద వేసుకుందో చూపించి- వురి లాంటి వుద్యోగంలో యెలా నెగ్గుకు వచ్చాడో, వోడిపోయాడో చూపించినా వాస్తవానికి దగ్గరగా వుండేది. లేదంటే మనం బోలెడు నక్షత్రాలను చూస్తాం కాని చందమామే మనకు గుర్తుంటుంది!

సందీప్ నటన చాలా బావుంది. కాసేపైనా సాయి ధరమ్ తేజ తన వంతు తాను బానే చేశాడు. వైవా హర్ష ట్రాక్ లో పడి రేజీనా పడి కొట్టుకు పోతే, జైస్వాల్ పోలీసు ఆఫీసరుగా కాల్చుకుపోయింది. తనీష్ విలన్ కు సరిపోయాడు. నటులని పదే పదే బిల్డప్ షాట్స్ లో చూపించి బోరు కొట్టించారు. సంగీతం పరమ రొటీన్. పాటలు యదా విధి. శ్రేయా పాట మూస ఫార్ములాలో యిమిడింది.

దాదాపు మూడుగంటలు వున్న సినిమా ఆఖరయ్యే కొద్దీ యింకా అవలేదేమని అనిపిస్తుంది!

రేటింగ్: 1.75/5

-జాసి