అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ తెలుగు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తుందా అన్న ఊహాగానాలకు తెర పడింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో జాన్వీ నటిస్తోంది అన్న కన్ఫర్మేషన్ వచ్చింది. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.ఎంతో మంది హీరోయిన్లను పరిశీలించి చివరిగా జాన్వీని తారక్ కి జోడీగా ఎంపిక చేసారు. దీంతో ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
జాన్వీ కూడా తెలుగులో నటించడం తనకు ఇష్టమేనని ఎప్పటి నుంచో చెబుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ విషయాన్ని కూడా మీడియాతో పంచుకుంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం నా డ్రీమ్. అది ఇప్పుడు నిజం అవుతుంది. ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఉన్నా. నా కల నిజమవుతుందన్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను అంటూ తెగ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాగే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ‘నాటు నాటు’ ఆస్కార్ అందుకోవడంపై యంగ్ టైగర్ ఛరిష్మాని ఆకాశానికి ఎత్తేసింది.
జాన్వీ మాటతో తెలుగు సినిమాలపై జాన్వీ ఎంత పాజిటివ్ గా ఉందో క్లారిటీ వస్తోంది. ఇప్పటికే ఈ జోడీ గురించి అభిమానుల్లో వాడివేడి చర్చ సాగుతుంది. ఎన్టీఆర్ నట వారసత్వం పుణికి పుచ్చుకుని తారక్ సినిమాల్లోకి వస్తే..తల్లి శ్రీదేవి వారసత్వంతో పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్-శ్రీదేవి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలొచ్చాయి. ఇప్పుడు వాళ్ళ వారసుల కాంబినేషన్ లో తొలి సినిమా పట్టాలెక్కుతోంది.
అలాగే తన కెరీర్ గురించి కూడా చెప్పుకొచ్చింది జాన్వీ. సినిమా ఇండస్ట్రీలో పుట్టడం తన అదృష్టం అంది. చాలా తొందరగా తనకు గుర్తింపు రావడానికి కారణం తన తల్లింద్రులే అంటోంది. నేను గ్లామర్ షోకి వ్యతిరేకం కాదు కానీ జనాలు దాని గురించి కన్నా తన నటన గురించి ఎక్కువ మాట్లాడుకుంటే సంతోషిస్తానని అంది. రూమర్స్ గురించి పట్టించుకోనని, నేను ఎలా ఉన్నా మాట్లాడుకుంటారు కాబట్టి అలాంటి వారిని డోంట్ కేర్ అంది జాన్వీ.