ఇక నుంచి వచ్చే చిత్రాలన్నీ ముందు థియేటర్లో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఇన్నాళ్లూ షూటింగ్ నిలిపివేసి సమస్యలపై చర్చించిన నిర్మాతలు వాటిపై ఓ అభిప్రాయానికి రాగా, ఆ వివరాలను దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్లో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ‘ఇక నుంచి విడుదలయ్యే సినిమాలన్నీ 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించాం. అలాగే థియేటర్లలో ధరలు తగ్గించాలని వారిని కోరాం. సానుకూలంగా స్పందించారు. వీపీఎఫ్ చార్జీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం ఎగ్జిబిటర్స్‌తో జరిగే తుది సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటాం. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ త్వరలో షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నాం. నిర్మాణ వ్యయం తగ్గించేందుకు ‘మా’తో ఒప్పందం కుదిరింది. ఫెడరేషన్ వాళ్లు అడుగుతున్న జీతాలపై నిర్మాతలు దగ్గరగా వచ్చేశారు. షూటింగ్ ఎప్పుడు మొదలవుతాయో త్వరలో స్వయంగా వెల్లడిస్తాం. ఇక మన చిత్ర పరిశ్రమ తీసుకునే నిర్ణయాలపై హిందీతో పాటు ఇతర దక్షిణాది చిత్రపరిశ్రమలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. మనం తీసుకునే నిర్ణయాలను వారు కూడా అమలు చేయాలనే ఆసక్తి వారిలో నెలకొంది’ అని వెల్లడించారు.