ఒక్క సినిమా రూ.2000..! - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క సినిమా రూ.2000..!

June 27, 2017

ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్తే ఇంతకు ముందు 5 వందల నోటు సరిపోయేది. ఇప్పుడు 2 వేల నోటు కూడా సరిపోయేటట్టు లేదు. ఇది మల్టీప్లెక్సుల్లో .మరి మామూలు ఏసీ థియేటర్లలో కొంతలో కొంత బెటర్. బాల్కనీ రూ.100 మించకపోయేది. కానీ ఇప్పుడు పెరిగిన టికెట్ల రేట్లు టాకీసుల వైపు చూడాలంటేనే భయపడేలా ఉన్నాయి. పెరిగిన రేట్లతో ఎవరికి లాభం..? సామాన్యుల్ని , మధ్యతరగతి జనాన్ని సినిమాకు దూరం చేస్తాయా..?

సెలవులు వచ్చాయంటే అందరూ సరదాగా ఉండాలనుకుంటారు. అందులో సినిమాకే ఫస్ట్ ప్రయారిటీ. ఒకప్పుడు ముందు వెనకా ఆలోచించకుండా ఫ్యామిలీలకు ఫ్యామిలీలు వెళ్లేవారు.వారానికి కంపల్సరీ ఒకటి చూసేవాళ్లు. మంచి సినిమాలు ఉంటే రెండు,మూడు చూసిన వాళ్లు ఉన్నారు. రాను రాను టికెట్ల రేట్లు పెరిగిపోవడం మూవీస్ అంటే పడిసచ్చేటోళ్లని కూడా ఆలోచించేలా చేసింది. సినిమా ఎలాగూ ఉన్నా పోయి చూసోద్దాం అనే ఫీలింగ్ పోయింది. కాలం మారినట్టే మనషుల ఆలోచనలు మారుతూ వస్తున్నాయి. ఫేవరేట్ హీరో అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే వాళ్లు టికెట్ల రేట్లను చూసి దడుసుకుంటున్నారు. బడ్జెట్ పద్మనాభంలు నెలకోమారు మాత్రమే టాకీసులవైపు కన్నెత్తి చూస్తున్నారు.

జీఎస్టీ ఎఫెక్ట్ తో ఇప్పుడు మళ్లీ టికెట్ల రేట్లు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్‌క్లాస్‌ టికెట్ ధర- రూ.120, లోయర్‌ క్లాస్‌ టికెట్ ధర- రూ.40. మున్సిపాలిటీల పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్‌క్లాస్‌ టికెట్ ధర-రూ.80, లోయర్‌ క్లాస్‌ టికెట్ ధర- రూ.30. పంచాయతీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్‌క్లాస్‌ టికెట్ ధర-రూ.70, లోయర్ క్లాస్ ధర రూ. 20 ఉండబోతున్నాయి.మల్టీప్లెక్స్ లలో ఇప్పటికే రూ.150.రూ.200 రేట్లు ఉన్నాయి.

అటు బ్యాంకులు బాదేస్తున్నాయి. ఇటు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటుతున్నాయి. చికెన్, మటన్ రేట్లు పెరిగిపోతున్నాయి. రెంట్లూ, గీంట్లూ జనాన్ని టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఇంకా ఇలా ఎన్నో తలనొప్పులు. వీటినుంచి రిలాక్స్ అయ్యేందుకు సినిమాకు వెళ్దామంటే థియేటర్లు భయపెడుతున్నాయి. నెలకు రెండు , మూడు సినిమాలు చూడాలని ఉన్నా…పెరిగిన టికెట్ల ధరలు ఒక్కదానితో సరిపెట్టుకునేలా చేస్తున్నాయి.

ఇద్దురు పిల్లలు ఉన్న కుటుంబం మల్టీ ప్లెక్స్ కు వెళ్తే ఆరు వందల రూపాయలు టికెట్లకే అవుతున్నాయి.నాన్నమ్మ, తాతయ్య ఉంటో అదనంగా మరో 3 వందలు. పిల్లలు పాప్ కార్న్ , ఐస్ క్రీమ్ , సమోసా, బర్గర్లు అంటే మరో అయిదు వందల నోటు తీయాల్సిందే. పాప్ కార్న్ పెద్దది అయితే 2 వందల పైనే. సమోసా 30 రూపాయలు. వాటర్ బ్యాటిల్ 40 రూపాయలు. పార్కింగ్ టూవీలర్ అయితే 50 లోపు ఫోర్, వీలర్ 100లోపు అవుతుంది. ఇలా టోటల్ గా చూస్తే రెండువేల నోటు మారిస్తే ఎంత మిగులుతుందో తెలుస్తూనే ఉంది. మిగతా మామూలు థియేటర్లలో ఇంతలా లేదు కానీ పెరిగిన టికెట్ల ధరలు మాత్రం సామాన్యుల ఆలోచించేలా చేస్తున్నాయి.

అందుకే జనం సెలెక్టెడ్ సినిమాలకే ఓటేస్తున్నారు. పాజిటివ్ టాక్ ఉంటేనే థియేటర్ల బాట పడుతున్నారు. లేదంటే ఎలాగూ నెలలో టీవీలలో వస్తుంది కదా అని సర్దుకుంటున్నారు. బాహుబలి లాంటి సినిమా అయితే థియేటర్ లోనే చూసి తీరాలనుకుంటున్నారు. మరి పెరిగిన రేట్లు చిన్న సినిమాలు ఎంత బాగున్నా వాటిని చూడాలంటే టికెట్ల రేట్లతో ఒకటి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఎవరు ఔనన్నా కాదన్నా సామాన్యుల్ని ఇబ్బందులు పెడుతున్నాయి. బాల్కనీ తర్వాత మరో క్లాస్ రీజనబుల్ గా ఉంటే బెటర్ . అటు హై ఇటు లో కాకుండా మధ్యస్తంగా మధ్యతరగతి వారు సర్దుకుపోతారు. టాకీసులోళ్లు జర ఆలోచించండి హై..కి లో.. కి మధ్య మిడిల్ క్లాస్ గురించి ఆలోచించండి…అప్పుడే సీట్లు ఫుల్లు అవుతాయ్.