దేశంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు నిత్యం పెరిగిపోతున్నాయి. ఈక్రమంలో ఓ మహిళ తన మీద పదేళ్లుగా జరుగుతున్న అత్యాచారానికి అంతం పలికింది. వీడియోను అడ్డం పెట్టుకుని తనని బ్లాక్ మెయిల్ చేస్తున్న మృగాడిని కత్తితో 25 సార్లు పొడిచి చంపేసింది. పదేళ్ల నుంచి తనను లైంగికంగా వేధిస్తూ నరకం చూసిస్తున్న ఆ మృగాడి బారి నుంచి తనకు విముక్తి లభించింది అంటోంది ఆమె. ఈ కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 12 రాత్రి ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపణలు చేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గునాలో చోటు చేసుకుంది.
పోలీసులు మృతుడిని అశోక్ నగర్ నివాసి బ్రిజ్ భూషణ్ శర్మగా గుర్తించారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 302 కింద మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆమెను బుధవారం కోర్టులో హాజరుపరిచారు. హత్యగావించబడ్డ వ్యక్తి 2005 నుంచి తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆ మహిళ తెలిపింది. ఆ వ్యక్తి తన 16 ఏళ్ల వయసులో పరిచయం అయ్యాడు అని, అతను 2005లో తనను మొదటిసారి అత్యాచారం చేశాడని పేర్కొంది. తనపై అత్యాచారం చేసిందే గాక అదంతా వీడియో తీసి దానిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసేవాడని చెప్పింది. ఆ వీడియోతో తనను పలుమార్లు రేప్ చేసాడని వివరించింది. తన ఇద్దరు పిల్లలతో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ కామాంధుడు తనమీద విరుచుకుపడి రేప్ చేశాడని కన్నీరుమున్నీరు అయింది.