అమెరికాలో ఉన్నత విద్య.. మార్కెట్లో బాగా పాపులార్టీ ఉన్న ఉద్యోగం.. రూ.కోట్లలో జీతం.. అన్నిటికీ మించి యవ్వనం. ఇన్ని క్వాలీటీస్ ఉన్న వాళ్లు వెంటనే మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిలవ్వాలనుకుంటారు. కానీ ఆ యువకుడికి ఇవన్నీ ఉన్నా.. మెదడులో ఏదో తెలియని అసంతృప్తి మొదలైందట. వీటన్నంటిని వదులుకొని జైన సన్యాసిగా మారేందుకు సిద్ధమయ్యాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రన్సుఖ్ కాంతేడ్(28) ఇంజినీరింగ్ పూర్తి చేసి.. 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర చదివిన తర్వాత డేటా శాస్త్రవేత్తగా స్థిరపడ్డాడు. అతడి జీతం ఏడాదికి అక్షరాలా రూ.1.25 కోట్లు. అయితే ఆ జీవితం అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. క్షణం జీవితానికి ఆనందం లేనప్పుడు, కోట్ల సంపాదనకు ప్రశాంతత లేనప్పుడు.. సాధువుగా మారి సన్యాసిగా జీవించడమే సరియైన మార్గమని నిర్ణయించుకున్నాడు. దీంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2021 జనవరిలో స్వదేశానికి తిరిగొచ్చేశాడు. ఈ నిర్ణయం గురించి తల్లిదండ్రులకు తెలియజేసి వారి సమ్మతి కోరాడు. కుమారుడి నిర్ణయంపై తొలుత తటపటాయించిన వాళ్లు మనసుకు నచ్చిందే చేయమని అనుమతించారు.
ఈ నెల 26న జినేంద్ర ముని వద్ద జైన సన్యాస దీక్ష తీసుకోకున్నాడు మన్సుఖ్. ఈ కార్యక్రమానికి 53 మంది జైన సాధువులు హాజరుకానున్నారు. అదే రోజు మన్సుఖ్తో పాటు మరో ఇద్దరు యువకులు సన్యాస దీక్షను స్వీకరించనున్నారు. తమ కుమారుడు జైన సన్యాసి కాబోతుండటంపై అతడి తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. వారికి ప్రన్సుఖ్తో పాటు మరో కుమారుడు ఉన్నాడు.