ఇకమీద నాపై దాడి చేస్తే బాడీలో బుల్లెట్లు దిగుతాయి : ఎంపీ అర్వింద్ హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

ఇకమీద నాపై దాడి చేస్తే బాడీలో బుల్లెట్లు దిగుతాయి : ఎంపీ అర్వింద్ హెచ్చరిక

May 4, 2022

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన భద్రత కోసం గట్టి చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు టీఆర్ఎస్ శ్రేణులతోటి తరచూ ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖకు చెప్పి బ్లాక్‌క్యాట్ కమాండో, బీఎస్ఎఫ్ జవానుతో పాటు నలుగురు మార్షల్స్‌లను నియమించుకున్నారు. వీరి ఖర్చంతా ఎంపీ స్వంతంగా భరించనున్నారు.

రాష్ట్రంలో ఒకపార్టీ, కేంద్రంలో మరో పార్టీ అధికారంలో ఉండడంతో పోలీసులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో వారు చెప్పినట్టుగానే నడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి అర్వింద్ అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా విన్నవించారు. అయితే అధికారికంగా రక్షణ కల్పించాలంటే సమయం పడుతుంది కాబట్టి అమిత్ షా సూచన మేరకు పై సెక్యూరిటీని నియమించుకున్నారు. అలాగే, కిలోమీటర్ పరిధి వరకు పనిచేసే విధంగా ఐదు వాకీటాకీలు, మూడు ప్రత్యేక వాహనాలు, అత్యాధునిక ఆయుధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సారి తన పర్యటనలో ఎవరైనా దాడులకు పాల్పడితే వారి శరీరంలోకి తూటాలు దూసుకెళ్తాయని అర్వింద్ హెచ్చరించడం గమనార్హం.