MP Arvind Tweet on social media after His House attacked by TRS activists
mictv telugu

‘ఎవడిని బెదిరిస్తున్నవ్.. ‘ కవితకు ఎంపీ అర్వింద్ కౌంటర్

November 18, 2022

తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై స్పందించారు ఎంపీ ధర్మపురి అర్వింద్. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాల మేరకే హైదరాబాద్ లోని తన నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. ఇంట్లో వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టించారని వాపోయారు. ఇంట్లో ఉన్న తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ పీఎంఓ, ప్రధాని నరేంద్రమోడీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ… “కవిత పార్టీ మారుతున్నట్లు నాకు తెలిసింది కాబట్టే మాట్లాడాను. నేను అన్నదాంట్లో నిజం ఉంది కాబట్టే ఆమె ఇంతలా రియాక్ట్ అయింది. కేసీఆర్ కూడా తన బిడ్డను పార్టీ మారాలని చెప్పాడు. మరి నీ అయ్యని కూడా చెప్పుతో కొట్టినవా? ముందు ఆయన్ను కొట్టు. నాకు తెలిసింది చెప్పా.. నేనేం తప్పు మాట్లాడలేదు. నా తల్లిని భయపెట్టించ హక్కు ఎవరిచ్చారు? కుల అహంకారంతో మాట్లాడుతున్నావ్ కవితా. ఎవడిని బెదిరిస్తున్నవ్.. నేను 2024లో మళ్లీ పోటీ చేస్తా.. రా చూసుకుందాం. దమ్ముంటే నా మీద పోటీ చేయ్. ఖర్గేకు కవిత ఫోన్ చేసిందా? లేదా అనేది కూడా తేలాలి” అని అర్వింద్ అన్నారు.

ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ తో టచ్లో ఉన్నారంటూ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎంపీ నివాసం వద్ద విధ్వంసం సృష్టించారు. ఆయన దిష్టి బొమ్మ దహనం చేయడంతో పాటు ఇంట్లోకి దూసుకెళ్లి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. టీఆర్ఎస్ ఇంట్లో ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు.

ఈ దాడి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ములేక భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు దాడులతో ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నరు అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ సహనాన్ని చేతగానితనం అనుకోవద్దు… మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరంటూ వార్నింగ్‌ ఇచ్చారు.