వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరవుతానని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సీబీఐకు ఓ లేఖ రాశారు. నేడు జరిగే విచారణకు వస్తున్నట్టు లేఖలో తెలిపారు. “కేసు ప్రారంభమైనప్పటి నుంచి నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పనిగట్టుకుని ఓ వర్గం లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోంది.అసత్య పసారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నాను.ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలి.. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి” అని అవినాష్ రెడ్డి లేఖలో విజ్ఞప్తి చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును హైదరాబాద్ నుంచి తెలంగాణకు బదిలీ చేశాక సీబీఐ స్పీడు పెంచింది. ఈ క్రమంలో ఈనెల 24న వైఎస్ అవినాష్ రెడ్డికి విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే ముందు నుంచి అనుకున్న కార్యక్రమాలు ఉండడంతో విచారణకు హాజరుకాలేనని ఐదు రోజులు తర్వాత వస్తానని అవినాష్ రెడ్డి తెలిపాడు. దీంతో మరోసారి సీఆర్పీసీ 160 సెక్షన్ కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. శనివారం విచారణకు హాజరకావాలని తెలిపింది. దీనికి అతడు వస్తున్నట్లు ప్రస్తుతం లేఖ రాశాడు. అవినాష్ రెడ్డి విచారణ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో జరగనుంది.