దారుణం.. వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

దారుణం.. వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి

May 14, 2022

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించారు. మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని సాగా బర్ఖెగా గ్రామంలో అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి కృష్ణజింకలను వేటాడుతున్నారనే పక్కా సమాచారంతో వేటగాళ్లను పట్టుకునేందుకు వెళ్లారు పోలీసులు. ఈ సమయంలో వేటగాళ్లు కాల్పులు జరపడంతో సబ్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్ జాతవ్, హెడ్ కానిస్టెబుల్ సంత్ రామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ మరణించారు. ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

వెంటనే పోలీసులు వేటగాళ్లపై కాల్పులు జరిపినప్పటికీ.. నిందితులు తప్పించుకున్నారు. ఘటనా స్థలం నుంచి కృష్ణ జింకల శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్రా పోలీస్‌ సిబ్బంది మృతి పట్ల సంతాపం తెలియజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై చర్చించేందుకు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.