కోడలికి మరో పెళ్లి చేసిన అత్తమామలు.. కట్నంగా రూ.60 లక్షల బంగ్లా - MicTv.in - Telugu News
mictv telugu

కోడలికి మరో పెళ్లి చేసిన అత్తమామలు.. కట్నంగా రూ.60 లక్షల బంగ్లా

May 14, 2022

అనురాగమే మంత్రంగా, అనుబంధమే సూత్రంగా వితంతువైన కోడలికి ఆమె అత్త‌మామ‌లే వివాహం జరిపించి, స‌మాజానికి ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిచారు. క‌రోనాతో భ‌ర్త‌ను కోల్పోయిన ఆ మ‌హిళ‌కు పెళ్లి చేసి కోడ‌లికి కొత్త జీవితాన్ని ప్ర‌సాదించారు. అంతే కాదు.. రూ. 60 ల‌క్ష‌ల విలువైన ఆస్తిని రాసిచ్చారు. ఈ అరుదైన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ధార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యుగ్ ప్రకాశ్ తివారీ కొడుకు ప్రియాంక్ తివారి గత ఏడాది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రియాంక్ తివారీకి భార్య రిచా, తొమ్మిదేళ్ల కూతురు కూడా ఉన్నారు.

అతడి మరణంతో విషాదంలో నిండిన కోడలికి కొత్త జీవితాన్ని ఇవ్వదలచుకున్న ప్రకాశ్ దంపతులు.. ఆమెను ఒప్పించి.. నాగ్‌పూర్‌కు చెందిన మరో వ్యక్తితో పెళ్లి చేశారు. కోడలిని కూతురిలా భావించి కన్యాదానం చేశారు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావించి రూ.60 లక్షల బంగ్లాను కూడా బహుమతిగా రాసి ఇచ్చారు. కోడలు రిచా, మనవరాలు అన్యల భవిష్యత్తు కోసం దగ్గరుండి పెళ్లి చేశామని, నాగ్‌పూర్‌లో తన కొడుకు ప్రియాంక్ కొన్న బంగ్లాను కూడా ఆమెకే ఇచ్చేశామని చెప్పారు. పెళ్లి తర్వాత అన్య కూడా తన తల్లితో కలిసి నాగ్‌పూర్‌కు వెళ్లింది. అలాగే ప్రియాంక్ మరణానంతరం అతని భార్య రిచాకు కంపెనీ ఉద్యోగం ఇచ్చింది.