కరెంట్ పోతే పోనీ… పొట్ట కోసేయండి!  - MicTv.in - Telugu News
mictv telugu

కరెంట్ పోతే పోనీ… పొట్ట కోసేయండి! 

November 29, 2019

స్మార్ట్‌ఫోన్‌లు వచ్చినప్పటినుంచి టార్చిలైటు, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్లను మరిచిపోయాం. వాటిని ఫోన్‌లోనే ఆపరేట్ చేసేస్తున్నారు.  కరెంట్ అలా పోగానే ఇలా ఫోన్‌లో టార్చిలైట్ ఆన్ చేస్తారు. అయితే పిడుక్కీ బియ్యానికి ఒకే మంత్రం పనికిరాదు. ఫోన్ లైట్లకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు సెల్‌ఫోన్‌ లైటు వెలుగులో రోగికి శస్త్ర చికిత్స చేసి తిట్లు తింటున్నారు. 

doctors perform.

ఉజ్జయిని జిల్లాలోని నగ్డా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన క్యాంపులో ఉన్నట్టుండి కరెంటు పోయింది. అప్పటికే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయాల్సిన ఓ రోగికి వైద్యులు ఇంజెక్షన్‌ ఇచ్చారు. కరెంటు పోతే ఏందీ.. అందరి వద్దా స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి కదా అనుకున్నారు.  వెంటనే రోగిని ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించి, సెల్‌ఫోన్‌లో టార్చి లైటు వెలుతురులో శస్త్రచికిత్స పూర్తి చేశారు. సుమారు గంటన్నర పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. అయితే, ఆస్పత్రిలో ఇన్వర్టర్‌ గానీ, జనరేటర్‌ గానీ పని చేయకపోవడం గమనార్హం. అందువల్లే వైద్యులు ఇలా సెల్‌ఫోన్‌ వెలుతురులో ఆపరేషన్‌ పూర్తి చేశారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఈ ఘటనపై వైద్యశాఖ మంత్రి తుల్‌సీ సిలావత్‌ స్పందించారు. సెల్‌ఫోన్‌ వెలుతురులో ఆపరేషన్‌ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగుకు యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు.