mp gorantla madhav is in another controversy in Anantapur
mictv telugu

న్యూడ్ వీడియో తర్వాత మరో వివాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్

November 9, 2022

సోషల్ మీడియాలో ఓ న్యూడ్(ఫేక్) వీడియోతో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఉంటున్న నివాసానికి సంబంధించి ఎంపీగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే మూడున్నరేళ్లుగా ఇంటి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆ ఇంటి ఓనర్ మల్లికార్జునరెడ్డి ఆరోపిస్తున్నాడు. ఎంపీగా గెలిచాక తన ఇంట్లో అద్దెకి దిగాడని, ఆరు నెలలే ఉండి ఆ తర్వాత వేరే ఇంటికి మారతానని చెప్పిన గోరంట్ల.. గడువు తీరినా ఖాళీ చేయలేదంటున్నాడు.

ఖాళీ చేయడం మాట అటుంచితే అద్దె, కరెంట్ బిల్లులు కూడా కట్టట్లేదంటూ వాపోయాడు
బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురంలోని రాంనగర్‌లో తన రెండంతస్తుల ఇంట్లో అద్దెకి దిగిన గోరంట్ల మాధవ్.. గడువు దాటిన తర్వాత కూడా మరికొన్ని నెలలపాటు ఇంట్లో ఉండేలా పెద్దమనుషుల ద్వారా వ్యవహారం నడిపారు. విసుగు చెంది ఈ ఏడాది సెప్టెంబరులో ఖాళీ చేయాలని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పోలీసులు, పలువురు రాజకీయ నాయకులు కల్పించుకుని అక్టోబరు వరకు గడువు ఇప్పించారు. అయినా మారకపోవడంతో తన ఇంటిని ఖాళీ చేయాలని కోరడానికి ఓనర్ ప్రయత్నించగా ఎంపీ వాగ్వాదానికి దిగారు. తాను ఇల్లు మారేది లేదంటూ తెగేసి చెబుతున్నారని మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. సీఐలు శివరాముడు, జాకీర్‌ హుస్సేన్‌ సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినకపోగా తనకే హెచ్చరికలు జారీచేశారని తెలిపారు. తనకు అద్దె కింద రూ.13 లక్షలు, కరెంట్ బిల్లు కింద రూ. 2,50,413 చెల్లించాల్సి ఉందని వివరించారు.