దేశంలో జరుగుతున్న ప్రమాదాలకు, క్రైమ్‌కి ముఖ్య కారణం మద్యం. ఈ విషయం అన్ని ప్రభుత్వాలకు తెలుసు. కానీ మధ్యపానాన్ని నిషేధించేందుకు ఏ సర్కార్ సాహసం చేయలేదు..చేయదు కూడా. ఎందుకంటే ప్రభుత్వాలకు భారీ ఆదాయం వచ్చి చేరేది మద్యంతోనే. దాంతో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భయం. అయితే కొన్ని ప్రభుత్వాలు మాత్రం మద్యం వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బార్ షాపులను మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలో నూతన మద్యం విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.ఈ నూతన విధానం ద్వారా కేవలం లిక్కర్ షాపులోనే మద్యం అమ్మకాలు జరగనున్నాయి. విద్యాసంస్థలు, గర్ల్స్ హాస్టళ్లు, ప్రార్థనా ప్రదేశాలకు 100 మీటర్లలోపు మద్యం దుకాణాలకు అనుమతి లేదని రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. బార్ షాపులను తగ్గించడం ద్వారా మద్యం వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఉమాభారతి ఆందోళనతో..
మధ్యప్రదేశ్ లో మద్యపాన నిషేధానికి బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉమా భారతి పోరాడుతున్నారు. రాష్ట్రంలో నూతన మద్యం విధానానికి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా విద్యాసంస్థలకు, ప్రార్థనా మందిరాలకు దగ్గరగా ఉన్న మద్యం షాపులపై కూడా దాడి చేశారు. వైన్ షాపు ముందు ఆవులను కట్టి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ తరుణంలోనే బార్ షాపులను నిషేధిస్తూ మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.