చీరతో కరోనా ఖతం.. కట్టుకుంటే ఇమ్యూనిటీ వస్తుందట..   - MicTv.in - Telugu News
mictv telugu

చీరతో కరోనా ఖతం.. కట్టుకుంటే ఇమ్యూనిటీ వస్తుందట..  

August 14, 2020

‘Immunity-boosting’ herbal sarees hit markets amid pandemic.

కరోనా సమయంలో విషాదాలు ఓవైపు వింత ప్రకటనలు మరోవైపు ఊదరగొడుతున్నాయి. కరోనాను అరికట్టాలంటే ముఖ్యంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిచుకోవాలని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ మాటను పట్టుకుని  ఇమ్యూనిటీని పెంపొందించే చీరలు అంటూ కొన్ని విలక్షణమైన చీరలు మార్కెట్‌లోకి వచ్చాయి. కడుపుకి మంచి ఫుడ్ తింటే శరీరంలో రోగనిరోధక శక్తి ఉత్పన్నం అవుతుంది కానీ, చీరలు కట్టుకుంటే శరీరానికి బలం వస్తుందా? ఈ అనుమానం చాలామందిలో కలిగింది. ఈ చీరలు మహిళల్లో రోగాలతో పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఘంటాపథంగా చెబుతున్నారు వారు. ‘ఆయుర్ వస్త్రా’ పేరుతో ఈ చీరలను మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ప్రవేశపెట్టాయి. వీటికి ఇమ్యూనిటీని పెంచే శక్తి ఎలా వచ్చిందనే విషయాన్ని సదరు కంపెనీ అధికారులు వెల్లడించారు. ఈ చీరలను  వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలతో రూపొందించామని చెప్పారు. 

లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకు, రాయల్ జీలకర్ర తదితర సుగంధ ద్రవ్యాలను ఈ చీరల తయారీలో ఉపయోగించామని అన్నారు. వీటిని పొడిచేసి రెండు రోజుల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఆ నీటిని మరిగించగా వచ్చిన ఆవిరిని చీరలకు పట్టించారట. ఈ పద్ధతిలో ఓ చీర రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు అందిపుచ్చుకోవడానికి గరిష్టంగా 6 రోజుల వరకు పడుతుందని పేర్కొన్నారు. అయితే ఈ చీరల ఖరీదు మాత్రం కాస్త ఎక్కువే అంటున్నారు. ఒక్కో చీరను రూ.3 వేలకు విక్రయించనున్నామని, మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ కమిషనర్ రాజీవ్ శర్మ వెల్లడించారు. మరోవైపు చీరలే కాకుండా ఇతర దుస్తులు కూడా ఈ తరహాలోనే రూపొందించామని తెలిపారు. కాగా, ఈ చీరలను ప్రముఖ వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్‌కు ‌మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్పగించింది. ఇది వందల ఏళ్ల నాటి పురాతన పద్ధతి అని వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్ స్పష్టంచేశారు.