MP Kavitha distributed asara pensions in maripeda
mictv telugu

ధనవంతులకు రుణమాఫీ చేస్తూ మాపై నిందలా.. ఎంపీ కవిత ఫైర్‌

September 5, 2022

కేంద్రం ధనవంతులకు రుణమాఫీ చేస్తూ సామాన్యులపై ధరల భారం మోపుతోందని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మండిపడ్డారు. తెలంగాణ, కేసీఆర్‌లతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టేనని అన్నారు. మరిపెడ మున్సిపాలిటీలో ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఇటీవల జిల్లాలో పర్యటించిన కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ధీటుగా సమాదానమిచ్చారు. జిల్లాలో కోనసీమలాగ ఉన్న పచ్చని పంట పొలాలు చూడలేకపోవడం మంత్రి దౌర్భాగ్యమన్నారు. రెప్పపాటు కూడా పోని కరెంట్ సరఫరా, ఇంటింటికి శుద్ధి చేసిన త్రాగునీరుతో భగీరథ, ప్రత్యేక పంచాయితీలుగా మారిన బంజారా తండాలు, ఆధునిక వైద్యం ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులు వంటివి చూసి మాట్లాడాలని హితవు పలికారు. అంబానీ, అదానీలకు కొమ్ము కాస్తూ వారి రుణాలు మాఫీ చేస్తూ వారి పక్షాన నిలబడుతుంది మీరు కాదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ప్రజలు పెద్ద మనసుతో ఆలోచించి కేసీఆర్‌కు అండగా నిలబడాలని కోరారు.