లంబాడా సమాజం అభ్యున్నతికి కృషి చేసిన రామారావ్ మహారాజ్‌కు భారత రత్నను కేంద్రం ప్రకటించేలా కృషి చేస్తానని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత చెప్పారు. గురువారం నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం పరిధిలోని డిచ్పల్లి మండలం దేవా తండాలో జగదాంబ మాత ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రచార రథాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత తెలంగాణ సేవాలాల్ మహారాజ్ పూజారుల కమిటీ అధ్య క్షుడు శివరాం మహారాజ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కవిత మాట్లాడుతూ రామారావ్ కు భారత రత్న ను ప్రకటించే అంశం గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు. టిఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా కేంద్రానికి లేఖ రాసేలా చూస్తానన్నారు.
తెలంగాణ ఉద్యమంలో తనతో బతుకమ్మలాడిన లంబాడా మహిళలు బాగుండాలని జగదాంబ మాతను కోరుతున్నానన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమని, అలాగే బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన తీజ్ పండుగలో తాను కూడా పాల్గొంటున్న విషయం మీకందరికీ తెలిసిందేనన్నారు. గిరిజనుల సంస్కృతి పరిరక్షణకు వేదపాఠశాలను ఏర్పాటు చేసేలా చూడాలని తెలంగాణ సేవాలాల్ మహారాజ్ పూజారుల కమిటీ కోరిక మేరకు నిజాబాబాద్‌లో వేద పాఠశాల ఏర్పాటు చేస్తే తాను సంతోషిస్తానన్నారు. యాత్రీకుల సౌకర్యార్థం, ఫంక్షన్ల కోసం ఆలయ పరిసరాల్లో ఫంక్షన్ హాలు నిర్మాణానికి తన ఎంపి నిధుల నుంచి రూ. 15 లక్షలను కేటాయిస్తున్నట్లు ఎంపి కవిత ప్రకటించారు.
బంజారాల సమగ్ర వికాసానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని ఎంపి కవిత తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడపిల్లల పెళ్లికి 75వేల 116 రూపాయలను ప్రభుత్వం ఇస్తున్నదని, ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లే గిరిజన స్టుడెంట్స్కు 20 లక్షల రూపాయలను కూడా అందజేస్తున్నదని చెప్పారు. త్వరలోనే తండాలు పంచాయతీలుగా మారుతాయన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపును అసెంబ్లీ ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు.
సర్పంచ్ లావణ్య దాసు కోరిక మేరకు దేవాతండాలో మహిళా భవనం నిర్మాణానికి తన నియోజక వర్గం నిధులను మంజూరు చేస్తున్నట్లు కవిత ప్రకటించారు.
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. జగదాంబ మాత ఆలయం రాజగోపురం నిర్బాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానన్నారు. ఇందల్వాయిలో రామాలయం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
Mp kavitha/Nizamabad/Ramarao maharaj