తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు, వలసయేతర నేతలు అంటూ గత కొంతకాలంగా రెండు వర్గాలుగా ఏర్పడి.. మీడియాకు కావాల్సినంత స్టఫ్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఎన్నికల సమయంలో సొంత పార్టీకి నేతకు మద్ధతు తెలుపలేదని ఆయన్ను అధిష్టానం మందలించగా.. అప్పటినుంచీ పార్టీతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. సర్దిచెప్పెంచేందుకు అధిష్టానం ఇప్పటికే దిగ్విజయ్ సింగ్ ను పంపగా.. ఆ వివాదాలన్నీ అలాగే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ కొత్త ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే హైదరాబాద్ కు వచ్చి.. కలవాలని ఫోన్ చేసినా గాంధీ భవన్ కు రాలేదు. గాంధీభవన్ కు రానని బయటే కలుస్తానని ఆయన చెప్పడంతో మాణిక్ రావు ఠాక్రే.. కోమటిరెడ్డి కోరిక మేరకు హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనని, నాలుగైదు సార్లు ఓడినవారితో తాను కూర్చోవాలా అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. తనకు ఏఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు చెత్తబుట్టలో పడ్డాయని చెప్పారు. నియోజకవర్గంలో బిజీగా ఉండటంతోనే బుధవారం గాంధీభవన్‌కు రాలేకపోయానని చెప్పారు. అయినా పార్టీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, పొడెం వీరయ్య, సీతక్క కూడా నిన్న పార్టీ కార్యాలయానికి రాలేదని, వారిని ఎందుకు అడగరని ప్రశ్నించారు. తమ ఫొటోలు మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీ పట్టించుకోలేదని చెప్పారు. ఫొటో మార్ఫింగ్ అయిందని స్వయంగా సీపీ తనకు చెప్పారన్నారు.