రాద్ధాంతం చేయొద్దు.. సొంత పార్టీ నేతలపై కోమటిరెడ్డి ఫైర్.. - MicTv.in - Telugu News
mictv telugu

రాద్ధాంతం చేయొద్దు.. సొంత పార్టీ నేతలపై కోమటిరెడ్డి ఫైర్..

February 15, 2023

Congress mp

 

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాదని, కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట మార్చారు. ఉదయం తాను రాష్ట్రంలో హంగ్ వస్తుందని చెప్పగా.. సాయంత్రం విమానాశ్రయినికి రాగానే తాను అలా అనలేదంటూ మాట మార్చేశారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరిస్తున్నారని.. అసలు తాను రాహుల్ గాంధీ చెప్పిందే వివరించానని చెప్పుకొచ్చారు. పార్టీలో ఉన్న చోటామోటా నేతలు కూడా తనపై విమర్శలు చేస్తున్నారని అసహానం వ్యక్తం చేశారు. తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని గానీ.. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని గానీ తాను ఎక్కడా చెప్పలేదన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఊరికే రాద్ధాంతం చేయొద్దన్నారు.

“నేను చేసిన వ్యాఖ్యలు నా వ్యక్తిగతం.. సోషల్ మీడియాలో వచ్చిన సర్వేలను ఆధారంగా చేసుకుని.. తెలంగాణలో ఉన్నట్టుండి ఎన్నికలు వస్తే ఎలా ఉంటుంది.. పార్టీల బలాబలాలేంటీ అన్నది విశ్లేషించాను.” అంటూ చెప్పుకొచ్చారు. తను ఉదయం చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకుంటే అలా ఉంటాయన్నారు కోమటిరెడ్డి. అంతకుముందు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాదని, దీన్ని ముందుగానే గ్రహించిన కేసీఆర్.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారని, అందుకే కాంగ్రెస్ గురించి ఈ మధ్య పాజిటివ్‌గా స్పందిస్తున్నారని రచ్చ లేపారు. తమ పార్టీ నాయకులంతా కలిసి పని చేసినా 40 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలు కాబట్టి పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని చెప్పారు.