పీసీసీ కమిటీల్లో సీనియర్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పైరవీలు చేసుకునే వారికే కమిటీల్లో ఎక్కువ ప్రాధాన్యత కల్పించారని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి… రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం స్పందించడం హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో మార్పు వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పీసీసీ కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లును పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన పీసీసీ కమిటీల్లో సీనియర్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పీసీసీ చీఫ్‌తో సమానమని ఎంపీ తెలిపారు. హుజూరాబాద్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రచారం చేయలేదో తమకు సమాధానం చెప్పాలని కోరారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పనిచేయడం లేదని.. అదే పక్క రాష్ట్రం ఏపీలో అయితే రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తోందని తెలిపారు. పేద ప్రజలు తమ వద్దకు వచ్చి ఆసుపత్రి బిల్లులు తగ్గించమని ప్రాధేయపడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యపై తగు పరిష్కారం చూపాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.