అధ్వానంగా మారిన రోడ్లపై బాధ్యత వహిస్తూ.. సాక్షాత్తూ ఓ రాష్ట్ర మంత్రి ప్రజలకు క్షమాపణలు కోరిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో వెలుగుచూసింది. గ్వాలియర్లో రోడ్డు దుస్థితికి క్షమాపణలు చెపుతూ ఆ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ ఓ వ్యక్తి పాదాలను కడిగి సంచలనం రేపారు. రోడ్ల దుస్థితికి తాను ప్రజలకు క్షమాపణలు చెపుతున్నానని, మురుగు నీటి లైన్ పని కోసం తవ్విన రహదారిని బాగు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
గతేడాది అక్టోబర్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పారు ప్రధుమన్ సింగ్. ఈ నేపథ్యంలో రోడ్లు నిర్మించే వరకు తాను చెప్పులు ధరించనని తెలిపారు. కాగా ఇటీవల ఆయన నిరసనతో ఇటీవల రోడ్ల మరమ్మతులు ప్రారంభమయ్యాయి. దీంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ప్రద్యుమన్ సింగ్ తోమర్ కు కొత్త చెప్పులు అందించారు. అనంతరం జ్యోతిరాదిత్య పాదాలకు ప్రధుమన్ నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. త్వరలోనే ఆ రోడ్లు అద్భుతంగా ఉండబోతున్నాయని జ్యోతిరాదిత్య స్పష్టం చేశారు.