మాజీ సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ దంపతుల అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ దంపతుల అరెస్ట్

April 23, 2022

హనుమాన్ చాలీసా పఠనం వివాదం మాజీ సినీ నటి, ప్రస్తుత అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసే వరకు వెళ్లింది. వివరాలు.. ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలనీ, లేకపోతే తామే ఆయన నివాసమైన మాతోశ్రీ వద్దకు వచ్చి హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాలు ప్రకటించారు. అనంతరం శివసేన పార్టీ కార్యకర్తలు నవనీత్ దంపతుల ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలిగించారంటూ ముంబై పోలీసులు శనివారం నవనీత్ దంపతులకు నోటీసులు ఇచ్చారు.

అయినా, సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదివే తీరుతామంటూ స్పష్టం చేయడంతో దంపతులను పోలీసులు ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో దంపతులిద్దరూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మేమేం ఉగ్రవాదులం కాదని వివరించే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి నివాసం ముందు ఇలాంటి కార్యక్రమాలను అనుమతి లేదని దంపతులకు నచ్చజెప్తున్నారు. అంతకు ముందు నవనీత్ కౌర్ రాణా దంపతులకు ముప్పు ఉందని నిఘా వర్గాలు సమాచారమందించడంతో కేంద్ర హోం శాఖ వీరికి వై కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబైలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.