ఎస్సీలైనందుకే మాకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు : మాజీ హీరోయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్సీలైనందుకే మాకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు : మాజీ హీరోయిన్

April 25, 2022

 

మాజీ సినీ హీరోయిన్, అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా మహారాష్ట్ర పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం ఉద్దవ్ థాక్రే నివాసం ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని చేసిన వ్యాఖ్యల అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు నవనీత్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అరెస్ట్ చేసిన రాత్రి తమకు ఎదురైన అనుభవాలను వివరంగా లోక్ సభ స్పీకర్‌కు లేఖ రాశారు. అందులో పలు సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మాటల్లో..‘శివసేనలో హిందూత్వ జ్వాలను తిరిగి తీసుకురావడానికి సీఎం ఇంటి ముందు ఆయనతో కలిసి హనుమాన్ చాలీసా పఠించాలని అనుకున్నాం. అంతేకానీ, మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలని కాదు. అయితే మా కార్యాచరణ ముంబయిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పోలీసులు చెబితే మా ప్రయత్నాన్ని విరమించుకున్నాం. ఈ విషయాన్ని బహిరంగ ప్రకటన ద్వారా తెలియజేశాం. అయినా పోలీసులు ఈ నెల 23న నన్ను, నా భర్తను ఖార్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా అందులోనే ఉంచారు. తాగేందుకు మంచినీళ్లు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా ఇవ్వలేదు. ఎస్సీలయిన మీకు మేం తాగిన గ్లాసుతో మీకు నీళ్లు ఇవ్వమని చెప్పారు. కులం పేరుతో దూషించారు. నిమ్న జాతికి చెందిన వాళ్లమన్న కారణంతో కనీసం తాగునీరు ఇవ్వలేదు. అంతేకాక, బాత్రూం వాడుకోవాలన్నప్పుడు కూడా తీవ్ర అభ్యంతర పదజాలం ఎదురైంది. మా బాత్రూంలను వాడుకోవడానికి కుదరదని చెప్పారు. ఎంతో దారుణమైన భాషలో దుర్భాషలాడారు’ అంటూ లేఖలో పేర్కొంది. దీనిపై జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించారు.