పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై తాజాగా ఢిల్లీలో ఉన్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఆయన మాటల్లో ‘నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలే లీకేజీకి కారణమని సీఎం జగన్ అన్నారు. మంత్రి బొత్స ఏమో లీకేజీ జరగలేదని చెప్తున్నారు. వీరిలో ఎవరి మాటలు నమ్మాలి. నిజాలు తెలియకుండా నారాయణను అరెస్ట్ చేయడం సరికాదు. అయితే వీరికొక అలవాటు ఉంది. విచారణ సమయంలో కొట్టడం కోసం సడెన్గా సీసీ కెమెరాలు తీసేస్తారు. వ్యక్తిగత సిబ్బందిని కూడా పంపించేస్తారు. దెబ్బతిన్న వ్యక్తిగా చెప్తున్నా. నారాయణ శరీర దారుఢ్యం ఏమేరకు ఉందో నాకు తెలియదు. కానీ, రెండు, మూడు దెబ్బలు కొడితే ఏమైనా జరగొచ్చు. ఆయన అభిమానులు కోర్టును ఆశ్రయించడం బెటర్’ అంటూ తన అనుభవాలను వెల్లడించారు.