వైసీపీపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణరాజు మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలలో కూడా గెలవడం కష్టమేనని పందెం రాయుళ్లు పందాలు కాస్తున్నట్లుగా రఘురామ వెల్లడించారు. మనకు మనమే సింహాలమని, వై నాట్ 175 అని బీరాలు పోతే , ఆ 25 స్థానాలు మరింత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో ప్రతిపక్ష కూటమి అభ్యర్థులు 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని పందెం రాయుళ్ళు ఇప్పటికే పందాలు కాస్తున్నట్లు తెలిసిందని రఘురామ తెలిపారు.శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు రోడ్ షోలకు వస్తున్న జనాన్ని చూస్తుంటే వైసీపీపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. జనాలు ఎందుకు దూరమవుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం సీఎం జగన్ పై ఉందన్నారు. తన పథకాలపై గొప్పగా చెప్పుకునే జగన్ ..ప్రకాశం జిల్లా సింగరాయకొండ హాస్టల్ విద్యార్థినులు అన్నమో రామచంద్రా అని అడుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లాలో బాలికల వసతి గృహంలో స్నానాల గదులు లేక బెడ్ షీట్లు అడ్డం పెట్టుకొని స్నానాలు చేస్తున్నారని విద్యార్థినులు రోదిస్తూ చెప్పిన వీడియోను రఘురామకృష్ణంరాజు మీడియా ముందు ప్రదర్శించారు. ఇంటింటికి స్టిక్కర్లు అతికించే కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని వైసీపీకి సూచించారు. మనల్ని ఎవరూ నమ్మనప్పుడు మా నమ్మకం నువ్వే జగనన్న అని ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికిస్తానంటే..ప్రతిపక్షాలు మా దరిద్రం నీవే అని కౌంటర్ స్టిక్కర్స్ అతికిస్తుందని చెప్పారు.