MP teacher suspended after disrobing girl, washing her uniform on school campus
mictv telugu

విద్యార్థిని బట్టలు విప్పించి ఉతికిన ఉపాధ్యాయుడు

September 25, 2022

 

కొసరు కోసం ప్రయత్నిస్తే.. అసలు కూడా పోయిందని పాత సామెత. ప్రచారం కోసం ఓ ఉపాధ్యాయుడు పడిన తాపత్రయం చివరికి అతడి ఉద్యోగానికే ఎసరు పెట్టింది. మధ్యప్రదేశ్‌లోని శహదోల్ జిల్లా జైసింగ్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఓ గిరిజన విద్యార్థిని 5వ తరగతి చదువుతోంది. పూర్తిగా మాసిన యూనిఫాంతో స్కూలుకు వచ్చిన విద్యార్థినిని చూసిన ఉపాధ్యాయుడు శ్రావణ్ కుమార్ త్రిపాఠి.. బాలిక యూనిఫాంను విప్పించి స్వయంగా ఉతికి శుభ్రం చేశాడు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. యూనిఫాం ఉతికి, అది ఆరేంత వరకు బాలిక అలాగే దుస్తులు లేకుండానే నిల్చుంది. యూనిఫాం ఆరిన తర్వాత తొడుక్కున్నాక కానీ బాలిక తరగతి గదిలోకి వెళ్లలేదు.

అక్కడితో ఊరుకున్నా అయిపోయేది. కానీ, ఆ ఉపాధ్యాయుడు తాను యూనిఫాం ఉతుకుతుండగా ఫొటో తీయించి దానిని విద్యాశాఖ గ్రూపులో షేర్ చేశాడు. పరిశుభ్రతకు తాను ప్రాణం ఇస్తానని అందులో రాసుకొచ్చాడు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ వందనా వైద్య స్పందించారు. అమ్మాయిని దుస్తులు లేకుండా నిలబెట్టి యూనిఫాం ఉతికిన ఘటనపై విచారణ జరిపించి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్టు శహదోల్ ట్రైబల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్ రాయ్ సిన్హా ఆ తర్వాత నిర్ధారించారు.