Mrinal Tagore remembers old tragedies
mictv telugu

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. సీతారామం హీరోయిన్ వెల్లడి

October 4, 2022

సీతారామంతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. బ్యూటీ విత్ ట్యాలెంట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్ లాంటి విలక్షణ నటుడి సరసన సమానంగా నటించి.. ఇండస్ట్రీలో లాంగ్ లాస్టింగ్ హీరోయిన్ అనిపించుకుంది. క్లాసిక్ లవ్ స్టోరీగా అన్ని భాషల్లో సీతారామం హిట్ అవ్వటంతో మృణాల్ ఠాకూర్ భారీగా రెమ్యునరేషన్ పెంచేసినట్టు టాక్. సీతారామంలో సీత పాత్రలో పద్ధతి, ప్రిన్స్ నూర్జహాన్ పాత్రలో హుందాగా కనిపించిన మృణాల్.. ఇప్పుడు తనలోని గ్లామర్ యాంగిల్‌ను కూడా బయటపెట్టేస్తుంది. అందాలని ఒలకబోస్తూ హాట్ ఫోటో షూట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తన నెక్స్ట్ మూవీ ఆఫర్స్ కోసం మృణాల్ సోషల్ మీడియాలో వరుసగా పలు ఇంటర్వ్యూల్లోను ముచ్చటిస్తోంది. ఈ నేపథ్యంలో తన జీవితంలో జరిగిన బ్యాడ్ మూమెంట్స్‌ను కూడా ఓపెన్‌గా చెప్పేసింది మృణాల్. ప్రతి మనిషి జీవితంలో జరిగే విషాదాలు తనకీ ఉన్నాయని.. ఒకానొక టైంలో డిప్రెషన్‌లోకి వెళ్లానని.. ఆ డిప్రెషన్ నుండి బయటికి రాలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనిపించినట్టు షాకింగ్ విషయాలని చెప్పింది మృణాల్ ఠాకూర్.

బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. తన సూసైడ్ స్టోరీని రివీల్ చేసింది. ‘టీనేజ్‌లో ఉన్న సమయంలోనే నేను మీడియాలోకి అడుగు పెడదామనుకున్నాన.. అందుకే పేరెంట్స్‌ను ఒప్పించి మరీ మీడియా కోర్సులో జాయిన్ అయ్యా. అయితే మా నాన్న బ్యాంకు ఉద్యోగి కావడంతో.. ట్రాన్సఫర్ అయి ముంబై నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. నేను ఒంటరిగా ముంబైలో ఉండిపోయా. ఆ సమయంలో కుటుంబానికి దూరంగా ఉంటున్నాననే ఫీలింగ్ నన్ను కలిచివేసేది. అదే సమయంలో మీడియా నాకు సెట్ అవ్వదనే భావన కూడా వచ్చేసింది. అప్పుడే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఆ సమయంలోనే నన్ను రకరకాల ఆలోచనలు వెంబడించాయి. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు అయితే మరీ ఎక్కువగా వచ్చాయి. ఇక ఒకరోజైతే లోకల్ ట్రైన్ కింద పడి చచ్చిపోవాలని కూడా అనిపించింది,’ అని ఓపెనప్ అయింది మృణాల్. అయితే నేను సూసైడ్ చేసుకుంటే పేరెంట్స్ తట్టుకోలేరని బాధతో చేసుకోలేదని చెప్పింది. అప్పుడే ఏదైనా సాధించాలని లక్ష్యం పెట్టుకుని సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన వచ్చిందంటూ పాత విషయాలు గుర్తుచేసుకుంది మృణాల్. ఇక సీతారామం సక్సెస్ తరువాత ‘ఎన్టీఆర్ 30’ మూవీలో మృణాల్ కి ఆఫర్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. దీంతో పాటు వైజయంతి బ్యానర్ లో ఒక యంగ్ హీరోతో కూడా మృణాల్ ఠాకూర్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం.