ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువకుడు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువకుడు మృతి

March 11, 2022

08

ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజార్‌కు చెందిన రాచకొండ శ్రీనివాస్‌, అరుణల కుమారుడు సాయి సూర్యతేజ(25) ఉన్నత చదువుల కోసం 2019లో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఆ తర్వాత ఉద్యోగం రావడంతో అక్కడే నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో తమ కొడుకు వద్దకు వెళ్లేందుకు తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే అతని మరణవార్త విని తల్లడిల్లిపోయారు. 2020లో ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్నాడు. కొవిడ్‌ నిబంధనల కారణంగా అప్పట్లో తల్లిదండ్రులు అతడిని చూసేందుకు వెళ్లలేకపోయారు.

అయితే, వైద్యుల సలహా మేరకు ఏప్రిల్‌లో కాలుకు శస్త్ర చికిత్స చేయించుకోవడానికి అతను నిర్ణయించుకుని తల్లిదండ్రులను ఆస్ట్రేలియాకు రమ్మని కబురు పెట్టాడు. దీంతో వారు ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఫిజియోథెరపి చికిత్సలో భాగంగా ఈనెల 7న ఆస్ట్రేలియాలోని రివర్‌వ్యూ హోటల్‌లో గోల్డ్‌కోస్ట్‌ స్విమ్మింగ్‌పూల్‌లో సాయి సూర్యతేజ వ్యాయామం చేస్తుండగా అందులో మునిగి మృతి చెందాడు. అతని స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం ఆందించారు. మృతదేహం ఈనెల 13 లేదా 14న నగరానికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.