కోటీ లంచం తీసుకున్న ఎమ్మార్వో.. దేశ చరిత్రలోనే తొలిసారి - MicTv.in - Telugu News
mictv telugu

కోటీ లంచం తీసుకున్న ఎమ్మార్వో.. దేశ చరిత్రలోనే తొలిసారి

August 15, 2020

MRO Take Bribe One Core in Keesara

మండల తాహశీల్దార్ కార్యాలయాల్లో ఏదో ఒక చోట భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీ వలకు చిక్కుతూనే ఉంటాయి. వారి నుంచి కేవలం లక్షల్లో మాత్రమే సొత్తు రికవరీ అయ్యేది. కానీ ఏసీబీ చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో అవినీతి అధికారి చిక్కాడు. 28 ఎకరాల వివాదాస్పద భూమిపై కొందరికి అనుకూలంగా పాసుపుస్తకాలు ఇచ్చేందుకు రూ. 1.10 కోట్లు లంచంగా తీసుకుంటూ రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఇది జరిగింది. ఒక ఎమ్మార్వో స్థాయి అధికారి ఈ స్థాయిలో లంచం డిమాండ్ చేయడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. అతని వద్ద లభించిన అవినీతి సొమ్ము చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

రాంపల్లి దాయరలో ఓ కుటుంబానికి 1996లో 44 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. ఇందులో 16 ఎకరాల భూమికి సంబంధించిన హక్కులను ఆ కుటుంబానికి కల్పిస్తూ అప్పటి ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మిగతా 28 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది. రియలెస్టేట్ కారణంగా భూముల ధరలకు రెక్కలు రావడంతో కొంత మంది దీనిపై కన్నేశారు. అక్కడి భూమి ధరలకు అమాంతం రెక్కలు రావడంతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వీటిపై కన్నేసింది.ఆ భూములను ఎలాగైనా దక్కించుకోవాలని కీసరకు చెందిన అంజిరెడ్డి ఎమ్మార్వోను ఆశ్రయించారు. కోటి రూపాయలతో ఒప్పందం కుదరడంతో ఆ డబ్బుతో ఎమ్మార్వో నాగరాజు తన ఇంటికి చేరుకున్నాడు. విషయం ముదే తెలియడంతో లంచంగా తీసుకున్న రూ. 1.10 కోట్లతోపాటు నాగరాజ్ ఇంటి నుంచి మరో రూ. 25 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.