MS Dhoni Spray Paints Chairs At Chennai's Chepauk Stadium
mictv telugu

ధోని చేసిన పని వైరల్….

March 27, 2023

MS Dhoni Spray Paints Chairs At Chennai's Chepauk Stadium

ఐపీఎల్-2023 సమరానికి సమయం ఆసన్నమవుతోంది. మార్చి 31 నుంచి క్రికెట్ పండగ ప్రారంభం కానుంది. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. అందరి కళ్లు సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపైనే ఉన్నాయి. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చెన్నై ఆటగాళ్ళు ప్రాక్టీస్‌లో అదరగొడుతున్నారు. ధోనితో పాటు జడేజా, స్టోక్స్ , మొయిన్ అలీ, రాయుడు వంటి కీలక ఆటగాళ్లు చెపాక్ మైదానంలో చెమటోడ్చుతున్నారు. ఇటీవల ధోనితో పాటు ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. తాజాగా ధోనీ ప్రాక్టీస్ వీడియోతో పాటు మరో వీడియో చెన్నై అభిమానుల మనస్సులను దోచేసింది.

ఐపీఎల్‌-2023 మొదటి మ్యాచ్‌ అహ్మదాబాద్ వేదికగా చెన్నై- డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ మధ్య జరగనుంది. చెన్నై రెండో మ్యాచ్ తన సొంత మైదానం చెపాక్ స్టేడియంలో ఏప్రిల్ 3న ఆడనుంది. దీంతో మ్యాచ్ కోసం స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు. చెపాక్ స్టేడియాన్ని ఈ మధ్యే పునరుద్ధరించారు. అలాగే చాలా ఏళ్ల తర్వాత ఐ,జే,కే స్టాండ్లను కూడా ఉపయోగంలోకి తెచ్చారు. ఈ సీజన్ ఐపీఎల్ లో అభిమానులను ఈ స్టాండ్లలోకి అనుమతించనున్నారు. దానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.

ఈ పనుల్లో చెన్నై కెప్టెన్ ధోని కూడా పాలుపంచుకున్నారు. సోమవారం ఉదయం స్టేడియంలోని కుర్చీలకు పెయింటింగ్ వేస్తూ ధోని కనిపించాడు. ధోనీ కూడా పసుపు, నీలం రంగు స్ప్రే పెయింట్ క్యాన్‌లతో బయటికి వచ్చి చెపాక్‌లో రెండు కుర్చీలకు పెయింట్ చేశాడు. ఈ వీడియోను సీఎస్కే తమ ట్విట్టర్ లో షేర్ చేయగా వైరల్ అయ్యింది. కుర్చీలకు పెయింట్ వేస్తున్న కెప్టెన్ కూల్‌ను అభిమానులు మురిసిపోతున్నారు. కింద ఉన్న వీడియోపై మీరు ఓ లుక్కేయండి.