కెరీర్ కష్టంగా ఉన్న సమయంలో భారత్ మాజీ కెప్టెన్ ధోని ఒక్కడే తనకు అండగా నిలిచాడని రన్ మిషన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ధోనీ స్వచ్చమైన ప్రేమ, అతనితో అనుబంధం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాని చెప్పాడు. ఆర్‌సీబీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన విరాట్ తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఫెయిల్యూర్ కెప్టెన్ అన్నారు
ఐసీసీ టోర్నీల్లో భారత్ జట్టును నాకౌట్‌కు చేర్చినా తనను ఓ ఫెయిల్యూర్ కెప్టెన్‌గా చూశారని విరాట్ ఆవేదన వ్యక్తం చేశాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, వరుసగా ఐదు టెస్ట్ మ్యాచ్‌లు గెలిచినా తన కెప్టెన్సీని విమర్శించినట్లు గుర్తు చేసుకున్నాడు.
ధోని ఒక్కడే..
” నా కెరీర్‌లో ఇప్పటికే భిన్నమైన దశలను చూశాను.ముఖ్యంగా గత సంవత్సరం ఫామ్‌లో లేక తంటాలు పడ్డాను. తీవ్ర విమర్శలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో నా భార్య అనుష్క షర్మ, కుటుంబ సభ్యులు, చిన్ననాటి కోచ్ కాకుండా అండగా నిలబడింది ధోని ఒక్కడే. నాకు పర్సనల్‌గా మెసేజ్ చేసి నాలో ధైర్యాన్ని నింపాడు.”నువ్వు బలంగా ఉండాలని అనుకున్నప్పుడు..ధృఢమైన వ్యక్తిగా కనిపిస్తున్నప్పుడు..నువ్వు ఎలా ఆడుతున్నావ్ ? అని అడగటం ప్రజలు మర్చిపోతారు అని ధోని చెప్పిన మాటలు నా మనస్సును తాకాయి.
99 శాతం నా ఫోన్ ఎత్తడు
ధోని ఇతరులకు చాలా అరుదుగా అందుబాటులో ఉంటాడు. పోన్ ఎక్కువగా ఉపయోగించడు. నేను కాల్ చేస్తే 99 శాతం ఆయన ఫోన్ ఎత్తడు. అలాంటి ధోని నుంచి నాకు మెసేజ్ రావడం ఆనందంగా అనిపించింది.రెండు సార్లు ఇలానే చేశాడు. ధోనీనే నన్ను కెప్టెన్‌గా ప్రమోట్ చేశాడు. ఎందుకంటే అతని సారథ్యంలో నేను ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాను. అతనికి డిప్యూటీగా చాలా కాలం పని చేసిన నేను అతనిలా గేమ్ అర్థం చేసుకోవడం నేర్చుకున్నాను. దాంతో నాకు సారథ్యం వహించే సామర్థ్యం ఉందనే నమ్మకం ధోనీకి కలిగింది” అని ధోనితో ఉన్న అనుబంధాన్ని కోహ్లీ పంచుకున్నాడు.