30 ఏళ్లలో ముంబై జలసమాధి! - MicTv.in - Telugu News
mictv telugu

30 ఏళ్లలో ముంబై జలసమాధి!

October 30, 2019

వాతావరణ మార్పు ప్రపంచాన్ని వణికిస్తోంది. పెరుగుతున్న భూతాపం సముద్ర తీర ప్రాంతాలను భయపెడుతోంది. మరికొన్ని దశాబ్దాల్లో ఆర్కిటికా, అంటార్కిటికా ఖండాల్లో ఉన్న మంచు కరుగనుందని తద్వారా సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోయే అవకాశముందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తాజాగా న్యూజెర్సీకి చెందిన క్లైమేట్‌ సెంట్రల్‌ అనే సైన్స్‌ ఆర్గనైజేషన్‌ జరిపిన పరిశోధనల్లో భారత ఆర్థిక రాజధాని ముంబై నగరానికి పెను ముప్పు ఉందని తేలింది. సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో 2050 నాటికి ముంబయిలో చాలా భాగం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది. 

mumbai.

ఈ సంస్థ జరిపిన పరిశోధన ప్రకారం..సముద్ర మట్టాలు నానాటికీ పెరుగుతుండటంతో 2050 నాటికి 150 మిలియన్ల ప్రజలు నివసిస్తున్న భూమి హై టైడ్‌ లైన్‌ కిందకు కుంగే ప్రమాదముంది. ముంబయిలో చాలా భాగం సముద్ర అలల దెబ్బకు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. వాణిజ్య ప్రాంతాలు విస్తరించడం, భవంతుల నిర్మాణాలే ముంబై నగరానికి పెను ముప్పని ఈ అధ్యయనం చెబుతోంది. సముద్రమట్టాలు పెరుగుతుండటంతో 2050 నాటికి తీర ప్రాంతాలు భూభాగంలోకి ఎలా చొచ్చుకుపోతాయనే అంశాలను ఈ అధ్యయనంలో వెల్లడించారు. ఈ అధ్యయనంలో విషయాలు గత అంచనాలకు విభిన్నంగా ఉండటం గమనార్హం. ‘రాబోయే ప్రమాదాన్ని దేశాలు గుర్తించి ఇప్పటి నుంచే సన్నద్ధమవ్వాలి. తీర ప్రాంత ప్రజలను అంతర్గతంగా ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉంది’ అని అంతర్జాతీయ వలసల సంస్థకు చెందిన డైనా లొనెస్కో అన్నారు.