Mukesh Ambani, family receive death threats in 8 anonymous telephone calls
mictv telugu

ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్.. ఏకంగా 8 సార్లు

August 15, 2022

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్‌కు ఫోన్ కాల్ చేసి, తాను టెర్రరిస్ట్ అని చెబుతూ.. ముకేశ్ అంబానీ అంతుచూస్తానని బెదిరించాడు. అంతేకాకుండా ఎన్ఐఏ, ఏటీఎస్, ముంబై పోలీసులపై దుర్భాషలాడాడు. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబర్కు ఈ కాల్ వచ్చినట్లు అక్కడి సిబ్బంది చెప్పారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వర్గాలు డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. ఏకంగా 8 సార్లు దుండగుడు బెదిరింపు కాల్స్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కాల్స్ వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

గతంలోనూ అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. గతేడాది ఆయన నివాసం అంటిలియా వద్ద పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో కనిపించడం కలకలం రేపింది. కొందరు దుండగులు జిలెటిన్ స్టిక్స్ ఉన్న కారును అంబానీ ఇంటి వద్ద నిలిపి ఉంచారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ కారును పోలీసులు గుర్తించి తనిఖీ చేయగా.. అంబానీని హెచ్చరిస్తూ ఉన్న లెటర్ లభ్యమైంది.