కొందరు నోటిలో వెండిచెమ్చాతో పుడతారని ఒక సామెత ఉంది. అది పూర్వకాలం సామెత. ఇప్పుడు ఏకంగా ప్లాటినం, వజ్రాలత చెమ్చాలతో పుట్టేస్తున్నారు. అపర కుబేరుడు ముఖేశ్ అంబానీకి మనవడు పుట్టాడు. అక్షరాలా 6 లక్షల కోట్ల రూపాయలను పుట్టుకతోనే వారసత్వంగా దక్కించుకున్నాడు ఆ చిన్నోడు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ దంపతులకు ఈ రోజు బాబు పుట్టాడు. ఆకాశ్ భార్య శ్లోకా మెహతా ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డా ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అంబానీ ఫ్యామిలీ తెలిపింది. శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతో తమకు వారసుడు పుట్టాడని పేర్కొంది. ధీరూభాయ్ వంశంలో కొత్త తరం ఆరంభమైందని, నూతన శకానికి ఇది బాట వేస్తుందని హర్షం వ్యక్తం చేసింది.
గత ఏడాది మార్చిలో ఆకాశ్, శ్లోకాల పెళ్లి జరిగింది. శ్లోకా.. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా, మోనా మోహతాల కూతురు. శ్లోకాకు పెళ్లి కానుకగా 400 కోట్ల విలువైన బంగ్లాను కూడా ఇచ్చారు. రిలయన్స్ కంపెనీపై ఆకాశ్ ఇప్పటికే పట్టు సాధించాడు. రిలయన్స్ జియో బోర్డులో అతడు డైరెక్టర్. శ్లోకా కూడా వ్యాపారం చేస్తోంది. రిలయన్స్ కంపెనీ టెలికం, పెట్రోల్, అగ్రి మార్కెట్, రిటైల్, క్లాత్, ఎలక్ట్రానిక్ తదితర రంగాల్లో కోట్లకు పడగలెత్తింది. ఏటా వెలువడే కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉంటున్నారు.