భోజనంపై లోక్‌సభలో ఆసక్తికర చర్చ..నవ్వుల్లో ముంచిన ములాయం - MicTv.in - Telugu News
mictv telugu

భోజనంపై లోక్‌సభలో ఆసక్తికర చర్చ..నవ్వుల్లో ముంచిన ములాయం

February 4, 2020

Lok Sabha.

లోక్‌సభ  సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార పార్టీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ సమయంలో మంగళవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సభ్యుల భోజనం విషయంలో జరిగిన చర్చ అందరిని నవ్వుల్లో ముంచేసింది. సభలో సీనియర్ ఎంపీగా ఉన్న ములాయం సింగ్ యాదవ్, స్పీకర్ ఓం బిర్లా మధ్య జరిగిన ఈ సన్నివేశం అందరిని ఆకట్టుకుంది. 

సభ జరుగుతున్న సమయంలో జీరో అవర్ తర్వాత స్పీకర్ ఓం బిర్లా 1.15 గంటల సమయంలో భోజన విరామం కోసం సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని విపక్ష సభ్యులు తప్పుబట్టారు. భోజనాన్ని వాయిదా వేసి ముఖ్యమైన అంశాలపై చర్చించాలని కోరారు. కాంగ్రెస్ సభ్యులు అంతా భోజన విరామాన్ని విరమించుకోవాలని కోరారు. ఓ దశలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కల్పించుకొని భోజన విరామంపై ఓటింగ్ చేపట్టాలని కోరారు.  దీనిపై స్పీకర్ తన చతురతను ప్రదర్శించి ఆ నిర్ణయాన్ని ములాయంకు అప్పగించారు. 

దీంతో సభ్యులంతా ఆయన ఏం చెప్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. స్పీకర్ మాటలతో ఆయన వెంటనే నవ్వుతూ పైకి లేచారు. అటూ ఇటూ చూసి ఒక్కసారిగా తన నిర్ణయాన్ని వెల్లడించారు.‘భోజనం చాలా అవసరం’అంటూ నవ్వుతూ ముందుకు సాగారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించిన సభ్యులు భోజనం కోసం వెళ్లిపోయారు. ఈ సన్నివేశం సభలో కొంతసేపు నవ్వులు పూయించింది.