10మంది అన్నల ముద్దుల చెల్లి.. ఇంట్లో ఆనందం..
‘నన్ను ఎవడైనా కెలికారో నా పది మంది అన్నలకు చెప్తా. ఒక్కక్కరు ఒక్కో స్టైల్లో నీ చమ్డాలు ఒలుస్తారు జాగ్రత్త’ ఇదేదో సినిమా డైలాగ్ అనుకునేరు. భవిష్యత్తులో ఓ అమ్మాయి ఈ డైలాగ్‌తో తన సత్తా నిరూపించుకోనుంది. పదిమంది అన్నల ఆ ముద్దుల చెల్లి వయసు ప్రస్తుతం పక్షం రోజులే. పదిమంది మగ సంతానం తర్వాత పుట్టిన ఆడబిడ్డ ఆ పాపాయి. అంతమంది మగబిడ్డల తర్వాత కలిగిన ఆడపిల్ల అవడంతో ఆ ఇంట్లో ఆనందం వెల్లువిరిసింది. పది మంది అన్నలకు చెల్లిగా ఆప్యాయతలు పొందేందుకు బ్రిటన్‌లో ఆ చిన్నారి జన్మించింది. బ్రిటన్‌కు చెందిన అలెక్సిస్ బ్రెట్, డేవిడ్ బ్రెట్ అనే దంపతులకు మొత్తం పది మంది సంతానం. ఇప్పటివరకు వారికి వరుసగా మగసంతానమే కలిగింది. పెద్దకొడుకు ఇప్పుడు 17 ఏళ్ల వయసు వుంటాడు. పదవ కొడుకు వయసు రెండేళ్లు.
ఆ బాబు తర్వాత అలెక్సిస్ మళ్లీ నెల తప్పింది. ఆడబిడ్డ కోసం వాళ్ళు చాలా ఎదురుచూశారు. కానీ, వాళ్ల ఎదురుచూపులు ఫలించక వరుసగా మగపిల్లలే పుట్టారు. ఈసారి కూడా అదే జరుగుతుందని భావించారు వాళ్లు. అయితే వారు అనుకున్నట్టు ఈసారి వాళ్లకు మగబిడ్డ కాకుండా ఆడబిడ్డ పుట్టింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆగస్టు 27న చిన్నారి జన్మించింది. పదకొండో బిడ్డగా ఆడ శిశువు పుట్టడంతో ఆ కుటుంబం అంతా ఎంతో ఆనందానికి లోనయ్యారు. ఆ పాపకు కామరాన్ అనే పేరు కూడా పెట్టారు. తనకు ఆడపిల్ల పుట్టిన శుభవార్తను ఆ తల్లి తన ఫేస్‌బుక్ ఖాతాలో వెల్లడించారు. కామరాన్ పుట్టడం ఎంతో ఆనందంగా ఉందని, ఇక ఇంతటితో పిల్లల్ని కనడం ఆపేయాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో చాలామంది నెటిజన్లు వాళ్లకు అభినందనలు తెలుపుతున్నారు.