బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు మద్దతు పలికినందుకు.. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో ఓ టైలర్ ను ఇద్దరు దుర్మార్గులు అత్యంత కిరాతకంగా చంపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ హత్యోదంతం సంచలనం రేపింది. ఉదయ్‌పూర్‌లో టైలర్ గా పనిచేస్తున్న కన్నయ్యలాల్… నుపుర్ శర్మకు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు.. కొందరు వ్యక్తులు అతడిని చంపుతామని బెదిరించారు. ఆపై జూన్ 28న అతని షాపులోకే ప్రవేశించిన ఇద్దరు దుండగలు కత్తులతో పొడిచి చంపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. ఈ ఉదంతం ఇంకా సద్దుమణగనట్లే కనిపిస్తోంది.
దారుణ హత్యకు గురైన కన్నయ్యలాల్ కు మద్ధతుగా 16 ఏండ్ల బాలిక తన ఫేస్ బుక్ వాల్‌పై ఓ పోస్ట్ పెట్టినందుకు.. ఆమెను కూడా చంపుతామని బెదిరింపు కాల్స్ చేశాడో వ్యక్తి. సౌత్ ముంబైకి చెందిన బాలిక ఫేస్ బుక్ వాల్‌పై పెట్టిన పోస్టును చూసి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు వాట్సప్ కాల్ చేశాడు. ఆ పోస్టుపై పెట్టిన కామెంట్లకు గానూ ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక వీపీ రోడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తాను చేసిన పోస్టును చూపిస్తూ… బెదిరింపులు వస్తున్నాయంటూ కంప్లైంట్ చేసింది. ఆమె చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.