Mumbai-based 'funeral service' startup makes a buzz at India
mictv telugu

‘చనిపోయారా.? కర్మకాండలు చేసేందుకు మేం సిద్ధం’..

November 22, 2022

పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు అద్దె మనుషులతో పూలు, పన్నీరు చల్లించడం.. డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేయడం లాంటివి ఇంతకు ముందు చూశాం. వధువు/ వరుడు తరఫు బంధువులు లేని వారికి ప్రైవేట్ వ్యక్తులచే పెళ్లి జరిపించడం లాంటి కార్యక్రమాలు జరిపించడం కూడా విన్నాం. కానీ ఎవరైనా చనిపోయిన తర్వాత.. బాధలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ.. మృతుడి కర్మకాండలు జరిపేందుక ప్రత్యేకంగా ఓ కంపెనీ ఉన్నట్లు ఎక్కడా చూసి ఉండరు. అలాంటి సేవలనే అందిస్తోంది ముంబైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ.

ఆత్మీయులను కోల్పోయి.. బాధలో ఉన్నవారికి సాంత్వన చేకూర్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కర్మకాండలు జరిపిస్తామని చెబుతోంది. ‘సుఖాంత్‌ ఫ్యునరల్‌ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌’ పేరుతో ప్రారంభించిన ఈ కంపెనీ కర్మకాండలతోపాటు, అంబులెన్స్‌ సర్వీస్‌, మరణ ధ్రువీకరణ పత్రం పొందేందుకు సాయం చేయడంవంటి సేవలను అందిస్తామని చెబుతోంది. కర్మకాండల సేవల కోసం ఈ కంపెనీ సుమారు ₹ 35 వేల నుంచి ₹ 50 వేల వరకు వసూలు చేస్తోందని సమాచారం. ఈ స్టార్టప్‌కు సబంధించిన ఫొటోను అవనీష్‌ వైష్ణవ్ అనే ఐఏఎస్‌ అధికారి తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘ఇలాంటి స్టార్టప్‌ అవసరం ఉందా?’’ అని ట్వీట్‌ చేశారు. దీంతో ఇది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. చివరకు చివరి ప్రయాణంలో కూడా అద్దె మనుషులే పాల్గొంటారా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.