బీజేపీ ఎంపీ ఔదార్యం.. కరోనా యోధులకు బంగారు నాణేలు  - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ ఎంపీ ఔదార్యం.. కరోనా యోధులకు బంగారు నాణేలు 

July 7, 2020

MP Gopal Shetty

కరోనా సంక్షోభంలో ప్రజలకు ఆపద్బాంధవుల్లా మారారు పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులు. ప్రాణాలకు తెగించి వారు ప్రజలను కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడుతున్నారు. అందుకే వారిని ‘కరోనా యోధుల’ అంటున్నారు. వారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిది. కరోనా అనంతరం వారికి ప్రతీ ఒక్కరూ కృతజ్ఞతగా ఏదో ఒక బహుమతి ఇవ్వాల్సిందే. వారి విలువను గుర్తించిన ఓ ఎంపీ వారికి ముందుగానే బంగారు నాణేలు అందించనున్నట్లు తెలిపారు. ఆయనే ముంబై నార్త్ బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి. కరోనా మహమ్మారితో యుద్ధంలో ముందుండి పోరాడుతున్న సెక్యూరిటీ గార్డులు, శానిటైజింగ్ వర్కర్లు, ఇతర పాలక సిబ్బందికి బంగారు నాణేలు అందించనున్నట్లు వెల్లడించారు. 

ఈ విషయమై గోపాల్ శెట్టి మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌పై యుద్ధంలో పారిశుద్య సిబ్బంది, పాలక సిబ్బంది చేస్తున్న సేవలు అనన్యసామాన్యమైనవి. అందుకే నగర వ్యాప్తంగా ఓ 30 మందికి ఒక గ్రాము బంగారు నాణెంతో పాటు రూ.5,000 బహుమానంగా ఇస్తున్నాను’ అని ఎంపీ తెలిపారు. అనంతరం ఆయన సాత్రా పార్క్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బోరివాలిలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. కాగా, ముంబైలో ప్ర‌స్తుతం 85,724 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 4,938 మంది మృతిచెందారు. చైనాలో ఇప్ప‌టి వ‌ర‌కు 83,565 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 4,634 మర‌ణాలు సంభ‌వించాయి. చైనాలో ఒక్క‌రోజు న‌మోదైన కేసులు.. ముంబైలోని ధార‌వి స్ల‌మ్ ఏరియాలో న‌మోదు అయ్యాయి. ముంబై వ్యాప్తంగా జులై ఒక‌టో తేదీ నుంచి ప్ర‌తి రోజు 1,100 కేసుల‌కు త‌గ్గ‌కుండా న‌మోదవడం కలవర పెడుతోంది.