మందుకొట్టిన మత్తులో విమానంలో గలీజ్ పని చేసి ప్యాసింజర్కు తగిన శాస్తే జరిగింది. మరీ ఇంత డిసిప్లెయిన్ భరించలేమంటూ అతడు పనిచేస్తున్న కంపెనీ కొరడా ఝళిపించింది. ఇంటికెళ్లి శాశ్వతంగా అలాంటి పనులే చేసుకోపోవయ్యా అని ఉద్యోగం నుంచి తొలగించింది. ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో శంకర్ మిశ్రా అనే పెద్దమనిషి ఓ వృద్ధురాలిపై మూత్రం పోయడం కలకలం రేపడం తెలిసిందే. ఈ సంగతి అతడు పని చేస్తున్న వెల్స్ ఫార్గో కంపెనీ దృష్టికి వెళ్లింది. మిశ్రా వ్యవహారం తమకు చాలా బాధ కలిగించిందని, తమ ఉద్యోగులు హుందాగా ఉండాలని తాము కోరుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది. ‘‘అతణ్ని వెంటనే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం. ఈ కేసులో విచారణకు సహకరిస్తాం..’’ అని తెలిపింది. మరోపక్క.. మిశ్రా కోసం ఢిల్లీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతని చివరి లొకేషన్ బెంగళూరుగా గుర్తించారు. మిశ్రా తరఫున అతని లాయర్లు ముంబై కోర్టులో వాంగ్మూలం కూడా సమర్పించారు. అతడు తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. మూత్రంతో తడిచిన వృద్ధురాలి దుస్తులను మరుసట్రోజు అతడు శుభ్రం చేసి నవంబర్ 30న అందించాడని వెల్లడించారు. బాధితురాలికి, అతని మధ్య వాట్సాప్ సంభాషణలు జరిగాయని, ఆమె ఫిర్యాదు చేయడానికి నిరాకరించిందని వివరించారు.