ఈ సీజన్ ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన మొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ జట్టు నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై గెలిచి ఈ ఘనత సాధించింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. బెంగళూరు ఆటగాళ్లలో ఫిలిప్పీ (33), దేవదత్ పడిక్కల్ (74), డివిలియర్స్ (15) పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీశారు.
బౌల్ట్, చాహర్, పోల్లర్డ్ ఒక్కో వికెట్ తీశారు. బెంగళూరు నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ 18, ఇషాన్ కిషన్ 25 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ అజేయంగా 79 పరుగులు చేశాడు. బెంగళూరు ఆటగాళ్లలో సిరాజ్, చాహల్ రెండేసి వికెట్లు తీశారు. క్రిస్ మోరిస్ ఒక వికెట్ పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.